అమెరికా 46వ అధ్యక్షునిగా ఎన్నికైన తర్వాత డెలావేర్లోని విల్మింగ్టన్‌లో డెమొక్రాట్లు నిర్వహించిన విజయోత్సవ సభలో పాల్గొన్నారు జో బైడెన్. తొలిసారి జాతినుద్దేశించి ప్రసంగించారు. అమెరికా ప్రతిష్ఠను ఇనుమడింపజేసేందుకు శాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అమెరికన్లు తమ భవిష్యత్తు కోసం ఓటు వేశారని చెప్పారు.
అధ్యక్ష స్థానం వరకు చేరుకున్న తన జీవితంలో సహకరించిన జీవిత భాగస్వామి జిల్ బైడెన్ సహా ఇతర కుటుంబ సభ్యులను ఈ సందర్భంగా బైడెన్ ప్రశంసించారు. ఎన్నికల్లో ఓడిన ట్రంప్ తనకు శత్రువేమీ కాదన్నారు. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నానన్నారు. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీనికోసం సోమవారం ఒక ప్రత్యేక కార్యదళాన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు అమెరికాలోని ప్రతి కుటుంబం ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నామన్నారు. దేశంలోని అన్ని వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేస్తామన్నారు.
అధ్యక్ష ఎన్నికల్లో నా గెలుపు అమెరికన్ల విజయం. అధ్యక్ష ఎన్నికల్లో నాకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు. ఉపాధ్యక్ష పదవికి ఎన్నికైన కమలా హారిస్ అద్భుత నాయకురాలు. దేశ ప్రజలు ఆశిస్తున్న పాలనను అందించేందుకు సహకరిస్తారు. ప్రస్తుత కరోనా విపత్కర పరిస్థితుల్లో ముందుకొచ్చి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. ఎన్నికల్లో ఓడిన ట్రంప్ నాకు శత్రువేమీ కాదు. అమెరికా అభివృద్ధి కోసం కలిసి పనిచేయడానికి సిద్ధం. కరోనా నియంత్రణకు అన్ని చర్యలు తీసుకుంటాం. అమెరికాలోని ప్రతి కుటుంబ ఆరోగ్య పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం. దేశంలోని ప్రజలందరి ప్రయోజనాల కోసం పనిచేస్తాం. దేశాభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తా. అమెరికా అభివృద్ధి కోసం రిపబ్లికన్లతో కలిసి సాగుతాం. ఇప్పుడు వచ్చిన తీర్పు దేశాభివృద్ధి కోసమేనని నమ్ముతున్నా. పరస్పర సహకారంతోనే ముందుకు నడవాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. అమెరికన్లు కలిసి ముందుకు సాగితే ఏదైనా సాధించగలరు. రిపబ్లికన్లు, డెమొక్రాట్ల మధ్య తేడాను చూపబోను. ఓటు వేసిన వారిని, వేయని వారిని సమానంగా చూస్తా.
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు