కరడుగట్టిన ఉగ్రసంస్థ ఇస్లామిక్ స్టేట్ అధిపతి అబు బకర్ అల్ బాగ్దాదీని తన చివరి గడియల్లో అమెరికా సైన్యానికి చెందిన శునకాలు తరిమి తరిమి వెంటాడాయి. అయితే ఈ వేటలో ఓ జాగిలం స్వల్ప గాయాలపాలైంది. కానీ, తనకిచ్చిన కర్తవ్యాన్ని మాత్రం పూర్తి చేసింది. ఓ కరడుగట్టిన ఉన్మాది.. ఇక తనకు ఈ లోకంలో నూకలు లేవని భావించి ఆత్మాహుతి చేసుకునే వరకూ వెంటాడింది. చికిత్స తర్వాత కోలుకుని... విధుల్లో చేరింది.
ప్రపంచాన్నే వణికించిన ఉగ్రనేతను పరుగులు పెట్టించిన శునకం ఫొటోను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే... ఆ జాగిలం పేరు చెప్పడం మాత్రం కుదరదని స్పష్టంచేశారు.
మాలినోయిస్ జాతి...
అమెరికా దళాలు విధుల్లో తమకు సహాయంగా బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన జాగిలాల్ని ఉపయోగిస్తుంటాయి. 2011లో ఇదే తరహాలో ఒసామా బిన్ లాడెన్‌ని హతమార్చిన ఆపరేషన్‌లో అమెరికా బలగాలు "కైరో" పేరు గల బెల్జియం మాలినోయిస్ జాతికి చెందిన శునకాన్ని ఉపయోగించారు.