ప్రపంచ నలుమూలలా అమెరికా సైనికులు ఉంటారు. పెద్దన్న పాత్ర పోషించడంలో అగ్రరాజ్యానికి ఇది ఎంతో కీలకం. అయితే.. ఈ భద్రతా దళాల కూర్పు రూపంలో అగ్రరాజ్యానికి కొత్త సమస్య వచ్చి పడింది. మరి దీనిని నూతన అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తారు?
సమీక్షతో..
పశ్చిమాసియాలోనే అమెరికా బలగాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇటీవలి కాలంలో చైనా, రష్యా నుంచి అగ్రరాజ్యానికి అనేక సవాళ్లు ఎదురువుతున్నాయి. ఈ నేపథ్యంలో పశ్చిమాసియాలో ఎక్కువ మార్పులు చేయకుండానే చైనా, రష్యాపై దృష్టిపెట్టాలని అమెరికా యోచిస్తోంది. ఇది ఒక సమస్య. బడ్జెట్ వ్యవహారం మరో సమస్య.
ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు.. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే.. అంతర్జాతీయంగా బలగాల మోహరింపుపై సమీక్షకు ఆదేశించారు లాయిడ్ ఆస్టిన్. బైడెన్ విదేశీ విధానానికి తగ్గట్టుగా.. దళాలు, ఆయుధాలు, శిబిరాలను ఎలా వినియోగించవచ్చో తేల్చడమే ఈ సమీక్ష ముఖ్యోద్దేశం.
ఇదీ చూడండి:-చైనా కట్టడికి అమెరికా 'టాస్క్ఫోర్స్' వ్యూహం
ట్రంప్ చర్యలతో..
యుద్ధానికి సర్వసన్నద్ధమై ఉండాలన్న అగ్రరాజ్య సైనిక ప్రాధాన్యంపై ఈ సమీక్ష దీర్ఘకాల ప్రభావం చూపే అవకాశముంది. అదే సమయంలో.. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'అమెరికా ఫస్ట్' విధానంతో మిత్ర దేశాలతో దెబ్బతిన్న సంబంధాలను కూడా బైడెన్ ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాల్సి ఉంటుంది.