తెలంగాణ

telangana

ETV Bharat / international

వీడియో: బాగ్దాదీని ఎలా మట్టుబెట్టారో తెలుసా..? - పెంటగాన్​ విడుదల చేసిన బాగ్దాద్​ హతం వీడియో

ఐసిస్​ అధినేత​ అబూ బకర్​ అల్​ బాగ్దాదీని మట్టుబెట్టిన ఆపరేషన్​కు సంబంధించిన దృశ్యాలను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్​ విడుదల చేసింది. వీడియోతో పాటు దాడికి గురించిన ఆసక్తికర విషయాలు వెల్లడించారు రక్షణ అధికారి కెన్నెత్ మెకంజీ.

వీడియో: బాగ్దాదీని ఇలా మట్టుబెట్టింది అమెరికా!

By

Published : Oct 31, 2019, 12:04 PM IST

Updated : Oct 31, 2019, 1:38 PM IST

వీడియో: బాగ్దాదీని ఎలా మట్టుబెట్టారో తెలుసా..?

కరడుగట్టిన ఉగ్రవాది అబూ బకర్‌ అల్‌ బాగ్దాదీని అంతమొందించిన అమెరికా.. ఆ దృశ్యాలను విడుదల చేసింది. ఈ వీడియోలో అమెరికా ప్రత్యేక బలగాలు నెమ్మదిగా బాగ్దాదీ ఉన్న ఇంటిని చుట్టుముడుతున్న సన్నివేశం స్పష్టంగా కనిపిస్తోంది. అంతకుముందు కిందికి దిగే సమయంలో హెలికాప్టర్లపైకి ముష్కరులు చేస్తున్న దాడిని అమెరికా దాడులు తిప్పికొట్టిన వీడియోను కూడా విడుదల చేసింది పెంటగాన్​.

దాడికి ముందు బాగ్దాదీ ఇల్లు ఎలా ఉంది.. దాడి తర్వాత ఎలా మారిందో చిత్ర రూపంలో బహిర్గతం చేశారు అధికారులు. పెంటగాన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అమెరికా సెంట్రల్‌ కమాండ్ అధికారి కెన్నెత్‌ మెకంజీ దాడికి సంబంధించిన మరికొన్ని ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

ముగ్గురిలో ఒకరు బతికే ఉన్నారు..

బాగ్దాదీని మట్టుబెట్టిన తర్వాత ఇంటిని పూర్తిగా నేలమట్టం చేసినట్లు తెలిపారు. అలాగే అధ్యక్షుడు ట్రంప్‌ ప్రకటించినట్లు బాగ్దాదీ తనకు తాను పేల్చుకున్న సమయంలో అతడి ముగ్గురు పిల్లలు చనిపోలేదని ఇద్దరు మాత్రమే మృతిచెందారని వెల్లడించారు. చనిపోయిన ఇద్దరూ 12 ఏళ్ల లోపు వారేనన్నారు. బాగ్దాదీ తన ఇద్దరు పిల్లలతో సొరంగంలో దాచుకొని కాల్పులకు తెగబడ్డాడని తెలిపారు. అనంతరం అక్కడే ఆత్మాహుతి చేసుకున్నాడని తెలిపారు.

భవనంలో ఉన్న మరో నలుగురు మహిళలు, ఓ పురుషుడు మృతిచెందారని స్పష్టం చేశారు మెకంజీ. ఆత్మాహుతి బాంబులు ధరించి ఉన్న ఆ మహిళలు సైనికుల్ని బెదిరించే ప్రయత్నం చేశారని అధికారులు వివరించారు. తిరిగి వెళ్లే సమయంలో హెలికాప్టర్లపైకి ముష్కరులు కాల్పులు జరపడం వల్ల మరోసారి వైమానిక దాడులు చేశామని, దీనిలో ఎంతమంది చనిపోయారన్నది స్పష్టంగా తెలియదన్నారు.

డీఎన్‌ఏ నమూనా

ఇంట్లో ఐసిస్‌ కార్యకలాపాలకు సంబంధించిన పలు ఎలక్ట్రానిక్‌, డాక్యుమెంట్ల రూపంలో ఉన్న ఆధారాలు సేకరించామన్నారు. బాగ్దాదీ 2004లో ఇరాక్‌ జైల్లో బంధించిన సమయంలోనే అతని డీఎన్‌ఏ ఆధారాలు సేకరించామన్నారు. వాటి ఆధారంగా మరణించింది అతనేనని నిర్ధరణకు వచ్చామన్నారు మెకంజీ. అనంతరం అంతర్జాతీయ నిబంధనల ప్రకారం అతడి అవశేషాల్ని 24 గంటల్లో సముద్రంలో ఖననం చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: 90 నిమిషాల 'ఆపరేషన్​ బాగ్దాదీ'​ సాగిందిలా..!

Last Updated : Oct 31, 2019, 1:38 PM IST

ABOUT THE AUTHOR

...view details