తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికా వీడియోల్లో ఉన్నవి ఫ్లయింగ్ సాసర్లేనా? - flying saucer images

గుర్తుతెలియని గగనతల వస్తువు(యూఎఫ్ఓ)లకు సంబంధించిన 3 వీడియో విడుదల చేసింది అమెరికా రక్షణ శాఖ. ఇవి ఇప్పటికే ప్రచారంలో ఉన్నా.. వీటిపై ఉన్న సందేహాలను నివృత్తి చేయటానికి విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ దృశ్యాల్లో కనిపించే ఎగిరే వస్తువులు అసాధారణ వేగంతో వెళుతున్నట్లు తెలుస్తోంది.

pentagon
పెంటగాన్

By

Published : Apr 29, 2020, 6:46 AM IST

Updated : Apr 29, 2020, 7:23 AM IST

గ్రహాంతరవాసులకు సంబంధించిన 'ఫ్లయింగ్‌ సాసర్ల'పై దశాబ్దాలుగా చర్చ సాగుతోంది. వీటిని ఆకాశంలో చూశామని కొందరు చెప్పుకొచ్చారు. ఈ వ్యోమనౌకల సాయంతో ఇతర గ్రహాల జీవులు భూమిని సందర్శించి ఉండొచ్చన్నది వారి వాదన. అయితే వీటిని అనేక మంది కొట్టిపారేశారు.

ఈ నేపథ్యంలో.. 'గుర్తుతెలియని గగనతల వస్తువుల' (అన్‌ ఐడెంటిఫైడ్‌ ఫ్లయింగ్‌ ఆబ్జెక్ట్స్‌-యూఎఫ్‌వో)తో కూడిన మూడు వీడియోలను అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం 'పెంటగాన్‌' అధికారికంగా విడుదల చేసింది. ఇలాంటి యూఎఫ్‌వోలతో కూడిన వీడియోలను ఒక దేశం బహిర్గతం చేయడం ఇదే మొదటిసారి.

3 వీడియోలు విడుదల..

వీటిలో ఒక వీడియోను అమెరికా నౌకాదళ పైలట్లు 2004 నవంబర్‌లో చిత్రీకరించారు. మిగతా రెండింటిని 2015 జనవరిలో రికార్డు చేశారు. అంతుచిక్కని కొన్ని వస్తువులు ఆకాశంలో వేగంగా దూసుకుపోవడం ఈ వీడియోల్లో కనిపించింది.

ఎఫ్‌-18 యుద్ధవిమానాలతో వెంబడిస్తూ అమెరికా నౌకాదళ పైలట్లు వీటిని చిత్రీకరించారు. ఇందుకోసం పరారుణ కెమెరాలను ఉపయోగించారు. ఈ వస్తువుల వేగాన్ని చూసి పైలట్లు ఆశ్చర్యపోతూ చేసిన వ్యాఖ్యలు వాటిలో వినిపించాయి.

క్షణాల్లో మాయం..

ఇప్పటికే ఈ వీడియోలు వ్యాప్తిలో ఉన్నాయి. అవి నిజమైనవేనా అన్న అనుమానాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ సందేహాలను తీర్చడానికి ఈ వీడియోలను అధికారికంగా విడుదల చేసినట్లు పెంటగాన్‌ ప్రతినిధి సూ గౌ చెప్పారు.

2004 నాటి ఘటన పసిఫిక్‌ మహాసముద్రంపై జరిగింది. గాల్లో ఒక గుర్తు తెలియని విమానం కనిపించిందని ఒక యుద్ధనౌక నుంచి సమాచారం అందింది. దీంతో ఇద్దరు పైలట్లు తమ యుద్ధవిమానాలతో ఆకాశంలో దూసుకెళ్లారు. నాడు ఆ వస్తువును వెంబడించిన నౌకాదళ పైలట్‌ డేవిడ్‌ ఫ్రావర్‌ 2017లో మీడియాతో మాట్లాడారు.

"40 మీటర్ల పొడవున్న ఆ వస్తువు ఊహించనంత వేగంతో దూసుకెళ్లింది. నా యుద్ధవిమానం వేగాన్ని పెంచి, దాని దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించా. అయితే అది మరింత వేగంగా దక్షిణ దిశలో వెళ్లిపోయింది. రెండు సెకన్ల కన్నా తక్కువ సమయంలోనే అదృశ్యమైంది."

- డేవిడ్‌ ఫ్రావర్‌, నౌకదళ పైలట్

2015లో చోటుచేసుకున్న ఘటనలకు సంబంధించిన వీడియోల్లో రెండు 'విమానాలు' వేగంగా ఆకాశంలో దూసుకెళ్లడం కనిపించింది. ఈ వస్తువుల తీరు చాలా భిన్నంగా ఉందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచంలో ఏ యుద్ధవిమానానికీ అలాంటి ప్రత్యేకతలు లేవన్నారు.

ఇదీ చూడండి:ట్రంప్... మా జోలికొస్తే వదలం: ఇరాన్

Last Updated : Apr 29, 2020, 7:23 AM IST

ABOUT THE AUTHOR

...view details