చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను అధిగమించడానికి అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ, సాంకేతిక రంగాలు సహా పలు కీలక అంశాల్లో అగ్రరాజ్యానికి దీటుగా ఎదుగాలనుకుంటున్న చైనాను కట్టడి చేసేందుకు టాస్క్ఫోర్స్ను ఏర్పాటు చేసింది పెంటగాన్. ఇది రానున్న కొన్ని నెలల్లో నిర్ణయాత్మక అంశాలపై సిఫారసు చేయనుందని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పెంటగాన్ సందర్శించిన బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"పౌర, సైనిక నిపుణులతో కూడిన టాస్క్ఫోర్స్ త్వరలోనే తన పని ప్రారంభిస్తుంది. రానున్న కొన్నినెలల్లో పలు కీలక అంశాలపై సిఫారసు చేస్తుంది. తద్వారా చైనా దూకుడుకు కళ్లెం వేసే మార్గాన్ని బలోపేతం చేస్తాం. చైనా సవాలును ఎదుర్కొనేలా.. భవిష్యత్ పోటీల్లో అమెరికన్లు విజయం సాధించేలా చేస్తాం. దీనికి ప్రభుత్వం, కాంగ్రెస్‌లో ద్వైపాక్షిక సహకారం, బలమైన పొత్తులు, భాగస్వామ్యాలు అవసరం."
- జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు