అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభిశంసనపై కీలక ప్రకటన చేశారు ఆ దేశ కాంగ్రెస్ దిగువసభ స్పీకర్ నాన్సీ పెలోసీ. అభిశంసనపై ముసాయిదా బిల్లు రూపొందించనున్నట్లు స్పష్టం చేశారు. అధ్యక్షుడు తన సొంత ప్రయోజనాల కోసం ఎన్నికల్లో మరోసారి అవకతవకలకు పాల్పడాలని చూస్తున్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు.. ఓ ప్రకటనలో స్పష్టం చేశారు.
" మన ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది. అధ్యక్షుడు తన సొంత ప్రయోజనాల కోసం మరోసారి ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడాలని ప్రయత్నిస్తున్నందున చర్యలు తీసుకోవడం తప్ప మాకు వేరే మార్గం లేదు."
-నాన్సీ పెలోసీ, దిగువసభ స్పీకర్
క్రిస్మస్ లోపు ట్రంప్‌ను అభిశంసన ఓటింగ్‌లో ఓడించి.. అధ్యక్ష పదవి నుంచి దింపాలని డెమొక్రాట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారమే డెమొక్రాట్లతో ఏకాంత భేటీ అయ్యారు పెలోసీ. అభిశంసనపై ఓటింగ్‌కు మీరు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించగా.. వారందరూ అందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం అభిశంసనపై ముసాయిదా బిల్లు ఏర్పాటు చేయనున్నట్లు గురువారం ఉదయం ప్రకటించారు పెలోసీ.