అమెరికాలో రానున్న రెండు వారాల్లో కరోనా మరణాల రేటు మరింత పెరిగే అవకాశముందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నివారించేందుకు 'సామాజిక దూరం' పాటించు మార్గదర్శకాలను ఏప్రిల్ 30 వరకు పొడిగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
"మరో రెండు వారాల్లో కరోనా మరణాల రేటు మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు ఏప్రిల్ 30 వరకు సామాజిక దూరం మార్గదర్శకాలను పొడిగిస్తున్నాం."
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
తగ్గుతుందని ఆశిస్తున్నా.. కానీ
తమ ప్రభుత్వం పలు కరోనా నివారణ చర్యలు తీసుకుంటోందని, త్వరలోనే వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇంతకు ముందు ఈస్టర్ నాటికే కరోనాను కట్టడి చేస్తామన్న ట్రంప్... ఇప్పుడు ఆ లక్ష్యాన్ని జూన్ 1 వరకు పొడిగించారు.
"విజయం సాధించడానికి ముందు... విజయం ప్రకటించడం కంటే దారుణం ఏమీ ఉండదు."