రక్తపుటేర్లు పారిన అఫ్గాన్ నేలపై శాంతి స్థాపనకు నడుం బిగించింది అమెరికా. రెండు దశాబ్దాలుగా ఉన్న వైరాన్ని మరచి తాలిబన్లతో చేసుకున్న శాంతి ఒప్పందంలో భాగంగా... అఫ్గానిస్థాన్‌లోని తమ బలగాలను ఉపసంహరించుకుంటోంది. జులై 15 నాటికి దాదాపు 8,600 దళాలను వెనక్కి తీసుకెళ్లిపోవడమే కాకుండా 5 ఆర్మీ స్థావరాలను తొలగించేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది అగ్రరాజ్యం.
మరి తాలిబన్లకు అఫ్గాన్‌ను అప్పగిస్తే మరిన్ని దాడులు పెరిగే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే... ఆ దేశంలో శాంతి సహా అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తున్న భారత్ లక్ష్యం నీరుగారినట్లే. ప్రస్తుతం అమెరికా చేపట్టిన విధానాల వల్ల అఫ్గాన్‌కు నష్టమేంటి? భారత్ ఎలాంటి విధివిధానాలతో ముందుకెళ్లాలి? వంటి అంశాలను ఆర్మీ మాజీ అధికారి ఉదయ్ భాస్కర్.. ఈటీవీ భారత్‌కు వివరించారు.
చివరిలో వదిలేస్తోందా..?
9/11 దాడి తర్వాత అమెరికా బలగాలు తాలిబన్లపై పోరు మొదలుపెట్టాయి. దాదాపు 20 ఏళ్లుగా వారితో పోరాడుతున్నాయి. ప్రస్తుతం వారి ప్రభావం చాలా వరకు తగ్గించేశాయి. ఇక పూర్తిగా అంతమైపోతుందనే సమయంలో ట్రంప్... శాంతి ఒప్పందం చేసుకుని బలగాలను ఉపసంహరించుకుంటున్నారు. తాలిబన్ల చేతుల్లోకి అఫ్గానిస్థాన్‌లో వెళితే పరిస్థితులు మారిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తూ... దోహా ఒప్పందం జరిగాక ఇటీవలె కాబుల్‌లో మరణమృదంగం మోగించాయి తాలిబన్‌కు చెందిన కొన్ని ఉగ్రమూకలు. బాంబులతో దాడులకు పాల్పడి పసిబిడ్డల సహా 20 మంది ప్రాణాలను బలిగొన్నాయి. అయితే అమెరికా బలగాలు ఉండగానే విధ్వంసం ఇలా ఉంటే.. భవిష్యత్తులో కచ్చితంగా పరిస్థితులు మారిపోతాయని ఆందోళన వ్యక్తమవుతోంది.
ఇలా దోహా ఒప్పందం...
ఒకప్పుడు బద్ధ శత్రువులుగా ఉండి.. పరస్పరం భీకరదాడులు జరుపుకొన్న అమెరికా, తాలిబన్... ఖతార్‌లోని దోహా వేదికగా చేయి చేయి కలిపాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 29న చారిత్రక శాంతి ఒప్పందంపై సంతకాలు పెట్టాయి. తాలిబన్ తరఫున ముల్లా బరాదర్, అమెరికా పక్షాన ఆ దేశ ముఖ్య చర్చల ప్రతినిధి ఖలీజాద్ ఒప్పందంపై సంతకాలు పెట్టారు. అల్ ఖైదాతో సంబంధాలు తెంచేసుకుంటామన్న తాలిబన్ హామీ తర్వాతే ఈ ఒప్పందం జరిగింది. ఈ కార్యక్రమానికి భారత్, పాకిస్థాన్, టర్కీ, ఇండోనేసియా, చైనా తదితర దేశాల ప్రతినిధులు హాజరయ్యారు.
⦁ శాంతి ఒప్పందం కింద..
- అన్ని షరతులకూ తాలిబన్ కట్టుబడితే 14 నెలల్లో అమెరికా, దాని మిత్రపక్షాల బలగాలు అఫ్గాన్ నుంచి పూర్తిగా వైదొలుగుతాయి.
- ఒప్పందం కుదిరిన 135 రోజుల్లో అక్కడున్న మొత్తం 13 వేల మంది సైనికుల్లో 8600 మందిని అమెరికా వెనక్కి తీసుకుంటుంది. అదే నిష్పత్తిలో అమెరికా మిత్ర పక్షాలు కూడా తమ బలగాలను నాలుగు నెలల్లోగా ఉపసంహరించుకుంటాయి.