అమెరికా గ్రీన్‌కార్డు జారీ ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేల మందికి త్వరలోనే ఉపశమనం లభించనుంది. కొత్త ఇమ్మిగ్రేషన్ బిల్లు చట్టరూపం దాల్చితే అనేకమంది భారతీయుల సహా ఇతర దేశాల వారికి శాశ్వతంగా అగ్రరాజ్యంలోనే నివసించే వెసులుబాటు కలగనుంది. అయితే ఈ గ్రీన్‌కార్డు లభించాలంటే వారు 5000 డాలర్ల వరకు అదనపు రుసుం చెల్లించాల్సి ఉంటుంది.
ఈ బిల్లును అమెరికా ఉద్దీపన ప్యాకేజీలో చేర్చి చట్టంగా మార్చితే వేలాది మంది భారతీయ ఐటీ నిపుణుల గ్రీన్‌కార్డ్ బ్యాగ్లాగ్ల సమస్య తీరిపోనుంది. అమెరికాలో శాశ్వత నివాస ధ్రువపత్రమైన గ్రీన్ కార్డు కోసం వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నారు.
- అమెరికా ప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ విడుదల చేసిన ఈ బిల్లు కాపీ ప్రకారం.. ఉపాధి ఆధారిత ఇమ్మిగ్రెంట్ దరఖాస్తుదారు ప్రాధాన్య తేదీ కంటే రెండు సంవత్సరాల ముందుగానే 5000 డాలర్లు అదనపు రుసుం చెల్లించడం ద్వారా సంఖ్యా పరిమితులు లేకుండా శాశ్వత నివాసానికి మార్గం సుగమం చేసుకోవచ్చు.
- ఈబీ-5 కేటగిరీ(వలస పెట్టబడిదారులు)కి దరఖాస్తు చేసుకునేవారు అదనపు రుసుం 5000 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.
- కుటుంబ ఆధారిత వలసదారులు గ్రీన్‌కార్డు పొందేందుకు 2500 డాలర్లు అదనపు రుసుం చెల్లించాలి.
- ప్రాధాన్య తేదీ రెండేళ్లలోపు లేని వారు 1500 డాలర్లు అదనపు రుసుం చెల్లించి గ్రీన్‌కార్డు పొందవచ్చు. దరాఖాస్తుకు చెల్లించే సాధారణ రుసుముకు ఉది అదనం.