శ్వేత సౌధాన్ని వీడిన అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. సౌత్ ఫ్లోరిడా పామ్ బీచ్‌లోని మర్-ఏ-లాగో క్లబ్‌కు తన నివాసాన్ని మార్చారు. అప్పటి నుంచి అక్కడే ఉంటున్నారు. అయితే.. మర్-ఏ-లాగో క్లబ్‌కు సంబంధించి పామ్ బీచ్ టౌన్‌తో చేసుకున్న 1993 నాటి ఒప్పందాన్ని ఆయన ఉల్లంఘించారని తెలుస్తోంది. ఈ ఒప్పందం ప్రకారం వరుసగా ఏడు రోజులు లేదా.. ఏడాదికి 21 రోజులకు మించి ఈ భవనంలో ఉండేందుకు వీలు లేదు.
అయితే.. మర్-ఏ-లాగో క్లబ్‌లోనే ట్రంప్ నివసించేందుకు అనువుగా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. క్లబ్ నిబంధనలపై ఫిబ్రవరిలో జరగనున్న కౌన్సిల్ సమావేశంలో చర్చిస్తామని పామ్ బీచ్ టౌన్ మేనేజర్ క్రిక్ బోలిన్ గురువారం ఓ ఈ మెయిల్ ద్వారా తెలిపారు.
మర్-ఏ-లాగో క్లబ్‌కు పొరుగున నివాసం ఉండే ఓ వ్యక్తి నుంచి పామ్ బీచ్‌కు గతవారంలో ఓ లేఖ వచ్చింది. ఈ క్లబ్ ఆస్తి విలువను ట్రంప్.. తగ్గించేందుకు యత్నిస్తున్నారని సదరు వ్యక్తి ఆందోళన వ్యక్తం చేశాడు. 2019లోనే ట్రంప్, ఆయన భార్య మెలనియా ట్రంప్.. తమ నివాసాన్ని న్యూయార్క్ నుంచి మర్-ఏ-లాగోకు మార్చారు. మర్-ఏ-లాగోలో ట్రంప్ నివసించకుండా నిషేధం విధించడానికి ఎలాంటి నిబంధనలు లేవని గతనెలలో ట్రంప్ కార్యాలయం నుంచి ఓ ప్రకటన విడుదలవడం గమనార్హం.
అసలేంటీ మర్-ఏ-లాగో?
126 గదులు ఉండే ఈ మర్-ఏ-లాగో భవంతిని 1985లో పది మిలియన్ల డాలర్లకు జనరల్ ఫూడ్స్ యజమాని వద్ద నుంచి ట్రంప్ కొనుగోలు చేశారు. ట్రంప్ దీన్ని కొనుగోలు చేసిన అనంతరం ఈ ఇంట్లో నివిసిస్తూనే మరమ్మతుల కోసం భారీగా ఖర్చు చేశారు. అయితే 1990లో తీవ్ర ఆర్థిక సమస్యల్లో ఉన్న ట్రంప్.. ఈ ఇంటిని పోర్షన్లుగా విభజించి అమ్మాలని యత్నించారు. కానీ, దీనికి పామ్ బీచ్ టౌన్ నిరాకరించింది.
1993లో మర్-ఏ-లాగోను ప్రైవేట్ క్లబ్‌గా మార్చడానికి టౌన్‌తోపాటు, ట్రంప్ అంగీకరించారు. ఇందులో 500 మంది అతిథులు మాత్రమే ఉండాలని టౌన్ నిబంధనలు విధించింది. వరుసగా ఏడు రోజులు లేదా సంవత్సరానికి 21 రోజులు మాత్రమే ఉండాలని తెలిపింది. ఈ షరతులు ట్రంప్‌కు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది.