ఉగ్రవాదంపై పాకిస్థాన్ సరైన చర్యలు చేపడుతోందన్న ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ వ్యాఖలను పేర్కొంటూ.. ఆ దేశ సైన్యం కూడా సరైన నిర్ణయాలు తీసుకోవాలని అగ్రరాజ్యం అమెరికా తెలిపింది. మసూద్ అజార్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ఐరాస ప్రకటించిన కొద్ది గంటల్లోనే ట్రంప్ పరిపాలన విభాగం ఈ వ్యాఖ్యలు చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది.
తీవ్రవాద సంస్థలకు మద్దతు తెలిపే పాక్ విధానాలను మార్చేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని అగ్రరాజ్య పరిపాలన విభాగం సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. పాక్ అంతర్గత రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలనుకోవట్లేదని.. పాక్‌లోని పరిస్థితులను సైన్యం చక్కబెడుతుందని ఆశిస్తున్నామన్నారు. తీవ్రవాదంపై సైన్యాధికారులు కూడా సరైన నిర్ణయాలు, విధానాలు చేపట్టాలన్నారు.