అఫ్గానిస్థాన్‌ను తాలిబన్లు(Afghanistan Taliban) ఆక్రమించుకోవడంలో పాకిస్థాన్ సహా ఆ దేశ నిఘా వర్గాలు కీలక పాత్ర పోషించాయని అమెరికాలో రిపబ్లికన్ చట్టసభ సభ్యుడు స్టీవ్ చాబొట్ వ్యాఖ్యానించారు. తాలిబన్ల విజయంపై పాక్ సంబరాలు చేసుకోవడం అసహ్యంగా ఉందని అన్నారు.
హిందూ పొలిటికల్ యాక్షన్ కమిటీ నిర్వహించిన వర్చువల్ సమావేశంలో పాల్గొన్న సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు చాబొట్. అఫ్గానిస్థాన్‌లో మైనార్టీలుగా(Afghanistan minority groups) ఉన్న సిక్కులు, హిందువులకు భారత్ స్వాగతం పలకడాన్ని ఆయన మెచ్చుకున్నారు.
"పాకిస్థాన్‌లో హిందువులు, సిక్కులు, క్రైస్తవులపై జరుగుతున్న దాడుల అంశం పెద్దగా అమెరికా ప్రజల దృష్టికి రావడం లేదు. వీటిపై అమెరికా ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ఈ హింస.. అపహరణలు, బలవంతంగా ఇస్లాంలోకి మార్చటం, హిందూ బాలికలను వృద్ధ ముస్లిం పురుషులతో బలవంతంగా వివాహం జరిపించటం వంటి హేయమైన పనులు సాగుతున్నాయి. మైనర్లను తమ కుటుంబం నుంచి తీసుకెళ్లి బలవంతంగా పెళ్లిళ్లు చేస్తున్నట్లు చాలా మీడియా సంస్థలు, హక్కుల సంస్థలు చెబుతున్నాయి. అయితే.. వాటిని పట్టించుకోకపోవటం బాధాకరం."
- స్టీవ్ చాబొట్, రిపబ్లికన్ చట్టసభ్యుడు