పెయిజ్ డిఎంజెలో... అమెరికాకు చెందిన 20 ఏళ్ల విద్యార్థి. తనకు పద్దెనిమిదేళ్లు వచ్చే వరకు తన శరీరంలో రెండు సంతానోత్పత్తి వ్యవస్థలు ఉన్నాయన్న విషయం ఆమెకు తెలీదు. అవును.. ఈ యువతికి రెండు జననాంగాలు, రెండు గర్భాశయాలు ఉన్నాయి. నెలకు రెండు సార్లు పీరియడ్లు వస్తుంటాయి. మొత్తంగా రెండు వేర్వేరు గర్భధారణ వ్యవస్థలు ఒకే శరీరంలో ఉన్నాయన్న మాట.
పెయిజ్‌కు ప్రతి రెండువారాలకు ఒకసారి పీరియడ్స్ వస్తుండేవి. పద్దెనిమిదేళ్ల వయసులో ఓ గైనకాలజిస్ట్ దగ్గరకు సాధారణ హెల్త్ చెకప్ కోసం వెళ్తే.. అసలు సమస్య బయటపడింది.
"నాకు పీరియడ్లు ఎప్పుడుపడితే అప్పుడు వచ్చేవి. ఒక్కోసారి రోజుల వ్యవధిలో నెలకు రెండు సార్లు వచ్చేవి. ఏ సమయంలో వస్తాయో తెలిసేది కాదు. నా హైస్కూల్ జీవితం ఇలాగే గడిచిపోయింది. ఈ విషయం గురించి తెలిసినప్పుడు ఇతరుల స్పందన చూస్తే నవ్వొస్తుంది. చాలా మందికి ఆత్రుత ఉంటుంది. ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. ముఖ్యంగా శరీర భాగాల గురించి తప్పుడు భావనతో ఉంటారు. శరీరం బయటివైపే రెండు జననాంగాలు ఉన్నాయని అనుకుంటారు. కానీ అది నిజం కాదు. అలా ఉండి ఉంటే ముందే నాకు ఈ విషయం తెలిసేది."
-పెయిజ్ డిఎంజెలో
డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు ఏదో అధిక కణజాలం ఉందని చెప్పారని యువతి పేర్కొన్నారు. ఆ తర్వాత తీసిన ఎంఆర్ఐ స్కానింగ్‌లో ఈ విషయం తెలిసిందని చెప్పారు.
"నాకు దీని గురించి ఏమాత్రం అవగాహన లేదు. ఒక్కసారి తెలియగానే జీర్ణించుకోలేకపోయాను. తొలుత కొంచెం హాస్యాస్పదంగా ఉండేది. గైనకాలజిస్ట్ నాకు వివరించిన తర్వాతే దీని గురించి తెలిసింది."
-పెయిజ్ డిఎంజెలో
పిల్లలు కనడం కష్టమే!
పెయిజ్ ప్రస్తుత స్థితి వల్ల ఆమెకు గర్భస్రావమయ్యే ప్రమాదం అధికంగా ఉంది. అకాల జననాలు సంభవించే అవకాశమూ ఉంది. ఒకవేళ భవిష్యత్తులో పిల్లల్ని కనాలని అనుకుంటే.. 'సరోగసీ' విధానమే మేలని వైద్యులు చెబుతున్నారు.