అధికార పగ్గాలు చేపట్టగానే తమకు అనేక సవాళ్లు ఎదురవుతాయని అమెరికా తదుపరి ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పేర్కొన్నారు. కరోనాను నియంత్రించడం తమ తొలి ప్రాధాన్యమని చెప్పారు. ఆర్థిక వ్యవస్థను బాధ్యతాయుతంగా పునరుద్ధరించడం, కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడం వంటివి చేపట్టనున్నట్లు వివరించారు. ప్రపంచవ్యాప్తంగా అమెరికా నాయకత్వాన్ని పునరుద్ధరించాలనుకుంటే తొలుత దేశీయ సవాళ్లపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
"శ్వేతసౌధంలోకి అడుగుపెట్టిన తర్వాత నాతో పాటు.. అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌కు వరుస సవాళ్లు ఎదురవుతాయని మాకు ఎప్పుడో తెలుసు. వీటిని పరిష్కరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అమెరికా సన్నిహిత దేశాలను ఒక్కచోటికి చేర్చాలి. దేశ భద్రత పెంపొందించాలి. అమెరికా ప్రయోజనాలను కాపాడే విదేశాంగ విధానాలను బలోపేతం చేయాలి. అందరికీ ముప్పుగా పరిణమించిన వాతావరణ మార్పులను ఎదుర్కొని పోరాడాలి."