ప్రపంచాన్ని కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. తాజాగా కరోనా కేసుల సంఖ్య 20 లక్షల 14 వేలు దాటింది. కరోనా మరణాలు 1 లక్షా 27 వేలుకు మించాయి. అయితే సుమారు 4 లక్షల 92 వేల మంది కోలుకోవడం కాస్త ఊరట. కానీ, వెలుగుచూస్తున్న కేసులకు, వాస్తవ కేసులకు మధ్య చాలా అంతరం కనిపిస్తోంది... నిజానికి చాలా దేశాల్లో వ్యాధి లక్షణాలు బయటపడిన వారికి మాత్రమే పరీక్షలు నిర్వహించి, చికిత్స అందిస్తున్నారు.
సగం కేసులు ఐరోపాలోనే..!
ప్రపంచవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల్లో సగానికి పైగా యూరోపియన్ దేశాల్లోనే వెలుగుచూడడం గమనార్హం. యూరోపియన్ దేశాల్లో ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా... 84,465 మంది మరణించారు.
మరణాలు తగ్గాయ్... కేసులు పెరిగాయ్
స్పెయిన్లో రోజువారీ కరోనా మరణాల సంఖ్య 523కి పడిపోయింది. మరోవైపు వరుసగా ఆరు రోజుల తరువాత పాజిటివ్ కేసుల సంఖ్య 5000కు పైగా పెరిగిపోయింది. ఇప్పటివరకు స్పెయిన్లో 1,77,000లకు పైగా కరోనా కేసులు నమోదవగా.. 18,579 మంది మృత్యువాతపడ్డారు.
అమెరికాలో కరోనా విజృంభణ
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు అక్కడ 6,09,240 కేసులు నమోదు కాగా... 26,033 మరణించారు.