కరోనా మహమ్మారి నియంత్రణకు చేతులు శుభ్రంగా ఉంచుకోవడమే చాలా కీలకం. భారత్‌లో 5కోట్ల మందికిపైగా ఈ కనీస సదుపాయం అందుబాటులో లేదని అమెరికా పరిశోధన వెల్లడించింది. నీరు, సబ్బు, శానిటైజర్లకు నోచుకోలేని పేద ప్రజలకే వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్నట్లు హెచ్చరించింది.
అమెరికా వాషింగ్టన్‌లోని ఇనిస్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్(ఐహెచ్ఎంఈ) పరిశోధకులు ఈ అధ్యయాన్ని ఎన్విరాన్మెంటల్ హెల్త్ పర్స్పెక్టివ్ జర్నల్‌లో ప్రచురించారు. చేతులు శుభ్రం చేసుకునేందుకు నీరు, సబ్బు వంటి కనీస సదుపాయాలు లేని వారు పేద, మధ్య తరగతి దేశాల్లో దాదాపు 200 కోట్ల మందికిపైగా ఉన్నారని పరిశోధన వెల్లడించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలో 25 శాతమని పేర్కొంది. సంపన్న దేశాలతో పోల్చితే వీరికే కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టం చేసింది.
అధ్యయనం ప్రకారం ఉప-సహారా ఆఫ్రికా, సముద్ర ప్రాంత దేశాల్లోని 50 శాతం మందికి సరైన హ్యాండ్‌వాష్ సదుపాయలు లేవు. 46 దేశాల్లోని సగానికిపైగా ప్రజలకు సబ్బు, నీరు అందుబాటులో లేవు.
భారత్, పాకిస్థాన్, చైనా, బంగ్లాదేశ్, నైజీరియా, ఇథియోపియా, డీఆర్ కాంగో, ఇండోనేసియా వంటి ఒక్కో దేశంలో 5 కోట్ల మందికిపైగా ప్రజలకు చేతులు శుభ్రం చేసుకునేందుకు సరైన సౌకర్యాలు లేవని అధ్యయనం వెల్లడించింది. తాత్కాలికంగా శానిటైజర్లు, వాటర్ ట్యాంకర్లు ఏర్పాటు చేసినా, అవి శాశ్వత పరిష్కారం కాదని స్పష్టం చేసింది.