ఆఫ్రో-అమెరికన్ జార్జి ఫ్లాయిడ్ కస్టడీ హత్య తర్వాత అగ్రరాజ్యంలో పోలీసులకు వ్యతిరేకంగా అనేక మంది గళమెత్తుతున్నారు. ఇదే క్రమంలో సియాటెల్ పోలీసు విభాగం, చట్టసంస్థలతో ఒప్పందాలను రద్దు చేసుకోవాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లను ఆ సంస్థ ఉద్యోగులు కోరుతున్నారు.
ఈ మేరకు సత్య నాదెళ్లతోపాటు వైస్ ప్రెసిడెంట్ కర్ట్ డెల్బెనీకి 250 మంది మైక్రోసాఫ్ట్ ఉద్యోగులు లేఖలు రాశారు. ఒప్పందాల రద్దుతోపాటు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ ఉద్యమానికి మద్దతు పలుకుతూ సియాటెల్ మేయర్ రాజీనామాకు డిమాండ్ చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఆందోళనల్లో పాల్గొన్నవారిని అణచివేసేందుకు ఎస్పీడీ దళాలు హింసాత్మక ధోరణిని అవలంబించాయని ఈ లేఖలో పేర్కొన్నారు.
మద్దతుగా ఉంటాం..
ఇప్పటికే నల్లజాతీయులకు, ఆఫ్రో అమెరికన్లకు మద్దతుగా నిలుస్తామని నాదెళ్ల ప్రకటించారు.
"మన సమాజంలో జాతి వివక్ష, విద్వేషానికి చోటు ఉండకూడదు. సహానుభూతి వ్యక్తం చేయడం, ఎదుటివారిని అర్థం చేసుకోవడం ప్రారంభమైనా.. మనం చేయాల్సింది చాలా ఉంది. నల్లజాతీయులు, ఆఫ్రో-అమెరికన్లకు మద్దతుగా నిలుస్తా. మా సంస్థలో దీన్ని అమలు చేసేందుకు మేం కట్టుబడి ఉన్నాం."