ఆరోగ్యం కోసం సరికొత్త 'ఫిట్ మంత్రం'! కండలు పెంచాలి.. ఫిట్‌గా ఉండాలి.. అనుకునే వారికి కరోనా మహమ్మారి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. లాక్డౌన్ ప్రభావంతో జిమ్‌లన్నీ మూతపడ్డాయి. తిరిగి తెరుచుకున్నప్పటికీ చాలా మంది వైరస్ భయంతో జిమ్‌లకు వెళ్లే సాహసం చేయడం లేదు. అయితే అమెరికా వాసులు కసరత్తుల కోసం కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. అవేంటంటే..
యాప్‌ల సాయంతో..
చాలా మంది అమెరికన్లు.. ఇంట్లోనే వ్యాయామం చేసేందుకు కావాల్సిన ఉపకరణాలను కొనుగోలు చేస్తున్నారు. దీనికోసం భారీగానే ఖర్చు చేస్తున్నారు. అయితే.. అలాంటివేమీ కొనాల్సిన అవసరం లేకుండానే, ఇంట్లోనే కసరత్తులు చేయొచ్చని అంటున్నారు అమెరికాలోని ప్రముఖ ఫిట్నెస్ నిపుణురాలు జిలియన్ మైకేల్స్.
"వారంలో ఒకటి లేదా రెండుసార్లు జిమ్‌కు వెళ్లే వారిని మనం చూస్తూ ఉంటాం. అయితే.. వారిలో చాలామంది ఇప్పటికీ.. బహిరంగంగా చేసే వ్యాయామాలను ఇంటి దగ్గరే చేస్తున్నారు. అందుకోసం భారీగా ఖర్చు చేసి, ఉపకరణాలను కొంటున్నారు. కానీ, వాటి అవసరమేమీ లేకుండానే ఇంట్లోనే ఉంటూ ఆన్లైన్ శిక్షణ ద్వారా వ్యాయామాలు చేయవచ్చు. జిమ్‌కు వెళ్తే కలిగే ఫిట్‌నెస్‌నూ సాధించవచ్చు.''
-- జిలియన్ మైకేల్స్, సెలబ్రెటీ ఫిట్నెస్ నిపుణురాలు
జిలియన్.. 2017లో ఫిట్నెస్ యాప్‌ను రూపొందించారు. ఆ యాప్‌లోనే వ్యాయామాలతో పాటు, ఆరోగ్యకరమైన వంటకాలు, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు కావాల్సిన అంశాలను బోధిస్తున్నారు. కరోనా ప్రభావంతో క్వారంటైన్, హోం ఐసొలేషన్‌లో ఉన్న చాలా మంది తమ యాప్‌ను వినియోగించారని జిలియన్ తెలిపారు.
బీచ్‌లో సరదాగా.. సురక్షితంగా..
భౌతికదూరాన్ని పాటిస్తూ వ్యాయామాలు చేసేందుకు వీలుగా బీచ్‌లను ఎంచుకుంటున్నారు చాలా మంది అమెరికన్లు. కాలిఫోర్నియాలోని వెనిస్ బీచ్.. బహిరంగ వ్యాయామాలకు చక్కని ప్రదేశంగా మారింది. పసిఫిక్ సముద్రతీరంలో వాలీబాల్ ఆడుతూ, జాగింగ్ చేస్తూ ఎంతోమంది కసరత్తులు చేస్తున్నారు. శారీరకంగా దృఢంగా ఉండడానికి ఇలా విభిన్నంగా ప్రయత్నిస్తున్నారు.
ఆక్వాయోగాతో హాయిగా..
నీటిపై తేలియాడే బోర్డుపై చేసే యోగాపై అమెరికా వాసులు ఇప్పుడు తెగ ఆసక్తి కనబరుస్తున్నారు. దీనినే 'యోగాఆక్వా' పేరుతో పిలుస్తున్నారు. బోర్డుపై నుంచి పడిపోకుండా చేసే ఈ యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుందని, మానసికంగా ఉల్లాసంగా ఉండగలుగుతామని అంటున్నారు. మొదటిసారి సారా తైఫెంతాలర్ అనే యోగా శిక్షకురాలు దశాబ్దం కిందట ఈ యోగాను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగా శిక్షకులకు ఆమె ఈ విద్య నేర్పిస్తున్నారు. కరోనా ప్రభావంతో ఈ యోగా నేర్చుకోవడానికి అందరూ ఆసక్తి చూపగా.. వారానికి మూడు రోజుల పాటు అందించే ఈ శిక్షణను ఆమె ఆరు రోజులకు పెంచారు.
"దురదృష్టవశాత్తు ఫిట్‌నెస్‌కు సంబంధించిన చాలా వ్యాపారాలు దెబ్బతిన్నాయి. కానీ, మాకు మాత్రం ఈసారి చాలా ఆదరణ లభించింది. ఎందుకంటే.. మేం ప్రజలకు అత్యంత జాగ్రత్తగా ఉండేలా వ్యాయామ శిక్షణనిస్తున్నాం. నిజం చెప్పాలంటే.. ఇప్పటి వరకు అన్ని వేసవి కాలాల్లో కెల్లా ఈ వేసవినే చాలా బిజీగా గడిపాం. మేము తీరిక లేకుండా ఉన్న సంవత్సరం కూడా ఇదే.''
-- సారా తైఫెంతాలర్, ఆక్వాయోగా శిక్షకురాలు.
రోజూ దాదాపు పది మంది వరకు యోగా చేస్తూ నీళ్లలో పడిపోతారని సారా అంటున్నారు. కానీ, దాన్ని వాళ్లు సరదాగానే తీసుకుంటున్నారని చెప్పారు. కరోనా తెచ్చిన మార్పులతో ఇలా విభిన్న మార్గాల్లో అమెరికన్లు వ్యాయామాల్లో సరికొత్త ట్రెండ్లను ఫాలో అవుతున్నారు. ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇదీ చూడండి:ఆ ఉపగ్రహాల వల్ల జ్యోతిషులకు కొత్త చిక్కులు!