ప్రపంచాన్ని కాకవికలం చేసిన కరోనా వైరస్ మూలాలను(Covid 19 Origin) కనుగొనేందుకు శాస్త్రవేత్తలు ఎంతో ప్రయత్నిస్తున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్(Wuhan Lab) నుంచే ఈ వైరస్ లీక్ అయి ఉంటుందని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఈ వాదనను చైనా ఖండించింది. ఇప్పుడు అమెరికా ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ-ఐసీ(US Intelligence Community).. కొవిడ్-19 మూలాలను కనుక్కోవడం ఎప్పటికీ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంతో వైరస్ పుట్టుక తెలుసుకోలేమని నివేదికలో పేర్కొంది.
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ మూలాలపై అమెరికా నిఘా విభాగం స్పష్టతకు రాలేకపోయింది. చైనాలోని వుహాన్ ల్యాబ్ నుంచే ఈ వైరస్ బయటకు వచ్చిందా? సహజంగానే పుట్టిందా? జీవాయుధాన్ని తయారుచేసేందుకే ఈ మహమ్మారిని సృష్టించారా? అన్న విషయాల్లో ఎలాంటి ముగింపునకూ రాలేకపోయింది. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఆదేశాల మేరకు 'కొవిడ్-19' మూలాలను కనుగొనేందుకు పరిశోధన సాగించిన 'ద డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్'.. శనివారం నివేదికను విడుదల చేసింది.
2019, నవంబరులోనే 'సార్స్-కొవ్-2' వైరస్ చిన్నగా మనుసులకు సోకడం ప్రారంభమైందని, డిసెంబరు నాటికి వుహాన్‌లో ఈ ఇన్‌ఫెక్షన్ బాధితుల సంఖ్య అమాంతం పెరగడంతో కొవిడ్ వ్యాప్తి గురించి తెలిసిందని నివేదిక పేర్కొంది. అయితే, దీని అసలు మూలం ఎక్కడన్న విషయమై ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ (ఐసీ) ఏకాభిప్రాయానికి రాలేదని తెలిపింది.
''కరోనా వైరస్‌ను జీవాయుధం కోసం సృష్టించలేదు. ఇది జన్యు ఇంజినీరింగ్ సాంకేతికతతో తయారైంది కాకపోవచ్చని చాలా ఏజెన్సీలు అభిప్రాయపడ్డాయి. ఈ రెండింటిలో ఏదోక అభిప్రాయానికి రావడానికి అవసరమైన ఆధారాలు లేవని మరో రెండు ఏజెన్సీలు చెప్పాయి. కొవిడ్ ప్రారంభ వ్యాప్తికి ముందు... ఈ వైరస్ గురించి చైనా అధికారులకు అవగాహనే లేదని ఐసీ పేర్కొంది. అందుబాటులో ఉన్న నివేదికలు, సమాచారాన్ని పరిశీలించిన తర్వాత... రెండు ప్రధాన పరిణామాలే కొవిడ్-19 ఇన్‌ఫెక్షన్‌కు మూలమని ఇంటెలిజెన్స్ కమ్యూనిటీ భావిస్తోంది.
1) ఇన్‌ఫెక్షన్‌కు గురైన జంతువు నుంచి వైరస్ మనిషికి సోకడం; లేదా కరోనా వైరస్‌ను 99% సరిపోలే ప్రోజెనిటర్ వైరస్ మనిషికి వ్యాపించి ఉండటం.
2) ప్రయోగశాల సంబంధిత ఘటన ద్వారా వైరస్ వ్యాపించడం.