Order of Covid Symptoms: కొవిడ్-19 బారినపడినవారిలో ఒక్కొక్కటిగా వ్యాధి లక్షణాలు బయటపడుతుంటాయి. చాలావరకూ ఇవి ఒక క్రమపద్ధతిలో ఉంటాయి. అయితే ఈ వరుస అన్నిసార్లూ ఒకేలా ఉండకపోవచ్చని, వేరియంట్లను బట్టి మారుతుంటుందని అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. భౌగోళిక ప్రాంతం లేదా రోగి తీరుతెన్నులను బట్టి వ్యాధి లక్షణాల క్రమం ఉంటోందా అన్నది పరిశీలించాలన్నది పరిశోధకుల ఉద్దేశం. ఈ వరుసను గుర్తించడం చాలా ముఖ్యం. తద్వారా ఇన్‌ఫెక్షన్‌ను ముందే పసిగట్టి, సమర్థ చర్యలతో వ్యాధి వ్యాప్తికి ఆరంభంలోనే కళ్లెం వేయడానికి వీలు కలుగుతుంది. పరిశోధనలో భాగంగా.. గత ఏడాది జనవరి నుంచి మే మధ్య అమెరికాలో వెలుగు చూసిన 3,73,883 కొవిడ్ కేసుల వ్యాధి లక్షణాల క్రమాన్ని విశ్లేషించడానికి మోడలింగ్ విధానాన్ని ఉపయోగించారు. అందులో వెల్లడైన అంశాలివీ..
- తొలుత చైనాలోని వుహాన్‌లో కరోనా మహమ్మారి ఉత్పన్నమైనప్పుడు రోగుల్లో మొదట జ్వరం వచ్చేది. ఆ తర్వాత దగ్గు ఉత్పన్నమయ్యేది. ఒళ్లు తిప్పడం లేదా వాంతులు మూడో లక్షణంగా కనిపించేది.
- అనంతరం కరోనా అమెరికాకు వ్యాప్తి చెందింది. అక్కడ.. దగ్గు మొదటి లక్షణంగా కనిపించింది. ఎక్కువ కేసుల్లో మూడో లక్షణంగా డయేరియా ఉత్పన్నమైంది.
- బ్రెజిల్, హాంకాంగ్, జపాన్‌లకు సంబంధించిన అదనపు డేటాను శాస్త్రవేత్తలు విశ్లేషించారు. దీన్నిబట్టి.. భౌగోళిక పరిస్థితులు, వాతావరణం, రోగి తీరు తెన్నులను బట్టి కొవిడ్ లక్షణాలు ఉండవని, కరోనా వేరియంట్లను బట్టే అవి మారుతున్నాయని గుర్తించారు.
- ప్రధానంగా 'డీ614జీ వేరియంట్' ఉనికి ఉన్న ప్రాంతాల్లో కొవిడ్ లక్షణంగా మొదట దగ్గు ఉత్పన్నమవుతోందని తేల్చారు. ఈ రకం వైరస్.. 2020 మొదట్లో అమెరికాలో చాలా ఎక్కువగా ఉండేది.
- జపాన్‌లో మొదట 'వుహాన్ రకం కరోనా' ప్రాబల్యం ఎక్కువగా ఉండేది. ఆ తర్వాత డీ614జీ ప్రాబల్యం పెరిగింది. దీనికి అనుగుణంగా వ్యాధి లక్షణాల వరుసలోనూ మార్పు చోటుచేసుకుంది.
- డీ614జీ వేరియంట్ సోకినవారికి మొదట దగ్గు రావడం వల్ల వారు జ్వరంతో ఇంటికి పరిమితం కావడానికి ముందే బహిరంగ ప్రదేశాల్లో తిరిగేవారు. అక్కడ దగ్గడం వల్ల వైరస్ ఎక్కువ మందికి వ్యాప్తి చెందేది. ఈ వేరియంట్ త్వరగా విస్తరించడానికి ఇది కూడా కారణమైంది.