ఇన్నాళ్లూ ప్రపంచదేశాలను మాటలతోనే గడగడలాడించిన డొనాల్డ్ ట్రంప్ పరిస్థితేం బాగోలేదిప్పుడు. అసలే ప్రత్యర్థి ప్రశ్నల వర్షంలో.. తన మాటల తూటాలు తడిచిపోయి పనిచేయని పరిస్థితి. సంవాదంలో గుక్కతిప్పుకోకుండా గెలిచేద్దామని భావించి.. చివరకు తానే దిక్కులు చూసిన సందర్భం. ఈ నేపథ్యంలో గెలుపు మార్గం అన్వేషణలో భాగంగా.. అస్త్రాలు పదును పెడదామంటే ఆస్పత్రిలోంచే అన్నీ ఆపరేట్ చేయాల్సిన తరుణం. ఇక ఈ పరిస్థితుల్లో ప్రచార పర్వంలో పరిగెత్తేదెలాగో తెలియక తలలు పట్టుకుంటున్నారు ట్రంప్ అస్మదీయులు.
కరోనా తెచ్చిన కలవరం..
ట్రంప్ ప్రపంచదేశాలపై ఊహకందని విధంగా విధించే ఆంక్షలలాగే... ఆహ్వానించని అతిథిలా ఊహించనిరీతిలో శ్వేతసౌధాన్ని బంధించేసింది కరోనా. పరిస్థితులు బాగాలేవు.. ఈ సమయంలో పార్టీలు వద్దంటూ అధికారులు మొత్తుకున్నా.. అధ్యక్షుడు వినలేదనే విశ్లేషణలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఏదైతేనేం, అధ్యక్షుడితో పాటు.. ఆయన సతీమణి కుడా కరోనా పాజిటివ్ అనిపించేసుకున్నారు. కొన్ని నెలలుగా.. ట్రంపా లేదా బైడెనా, ఎవరు కావాలో తేల్చుకోండి అన్నవిధంగా ఇరుపార్టీలు ప్రజలకే అల్టిమేటం ఇస్తున్నాయి. ఇది కరోనాపై పోరాటంలో ప్రభుత్వానికి రెఫరెండంగా చెబుతూ ముందుకెళ్దామని భావించినా.. వాతావరణం వేగంగా మారిపోయింది. ముఖ్యంగా రిపబ్లికన్లలో ఉక్కపోత కనిపిస్తోంది.
ట్రంప్ గుడారంలో గుబులు
వీటన్నిటికంటే ముందు ట్రంప్ గుడారంలో గుబులు రేపింది. మొదటి సంవాదంలో అధ్యక్షుడి మౌనం, దేశంలో పెరుగుతున్న హింస... ముఖ్యంగా శ్వేతజాతీయులు అణిచివేత ధోరణి గురించి ప్రత్యర్థి ప్రశ్నిస్తే... కనీసం పట్టనట్లు వ్యవహరించటం, ఆ అంశంపై నోరు పెకలకపోవటం అందరిలో అనుమానంతో కూడిన ఆశ్చర్యం కలిగించింది. అంతేనా, అప్పటికే.. ట్రంప్ కట్టిన పన్నుల చిట్టా సంపాదించిన డెమొక్రాట్లు ప్రచారంలో దంచేస్తున్నారు. ప్రజలకు వివరాలు పంచేస్తున్నారు. ఇక నష్టనివారణ చేపట్టాల్సిన పరిస్థితుల్లో.. అధ్యక్షుల వారు మిన్నకుండిపోయారు. దీంతో తమ ప్రచార నావ నట్టేట మునిగినట్లేనని గగ్గోలు పెడుతున్నారు రిపబ్లికన్లు.
మరో నెలరోజుల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ప్రచారం మంచి రసపట్టులో ఉంది. ఈ దశలో అధ్యక్షుడు ట్రంప్ కొవిడ్ బారిన పడటం వల్ల ఎన్నికలు, ఆయన ఆరోగ్య పరిస్థితి, అనంతర పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. వృద్ధాప్యంలో కరోనా సోకడం ప్రమాదకరమేనని ప్రపంచవ్యాప్తంగా అనేక ఉదంతాలు చెబుతున్నాయి. 74 ఏళ్ల ట్రంప్ ఇంట్లోనే ఉంటూ పూర్తిగా కోలుకున్నా.. చురుగ్గా ఉండగలుగుతారా ? ప్రచారంలో పాల్గొంటారా ? ప్రత్యర్థిని పడగొట్టేలా నిలబడతారా ? పార్టీని నిలబెడతారా ? నిర్లిప్తంగా ఉన్న ఏ రిపబ్లికన్ను కదలించినా వినిపించే మాటలివే.
ప్రచారం పరిస్థితేంటి ?
ఈ పరిస్థితుల్లో ట్రంప్ మరోసారి వైట్‌హౌస్‌లో దర్జాగా తిరిగేందుకు సర్వస్వం దారబోస్తున్న ప్రచార నిర్వాహకులు ఇక తమపై ముప్పేట దాడి జరిగినట్లే అన్న భావనలో ఉన్నారు. వీరి వాదనను కాదనలేని కారణాలున్నాయి మరి. 'ట్రంప్ ఉన్నారు. అన్నీ చూసుకుంటారు' అని ఇన్నాళ్లుగా ఉన్న ధీమా సంగతి అటుంచితే... ప్రస్తుతం అసలేం చేయాలో దిక్కుతోచని స్థితిలో పడ్డారు.