అత్యవసర విభాగంలో చికిత్స పొంది కోలుకున్న అనంతరం 10 మంది కరోనా బాధితుల్లో ఒకరు తిరిగి వారంలోనే ఆసుపత్రిలో చేరుతున్నట్లు ఓ అధ్యయనంలో తేలింది. మొదటి మూడు నెలల్లో చికిత్స పొందిన 1400 మందికిపైగా రోగుల వైద్య నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయానికి వచ్చినట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను అకడెమిక్ ఎమర్జెన్సీ మెడిసిన్ మ్యాగజైన్లో ప్రచురించారు. మార్చి నుంచి మే నెలల మధ్య కాలంలో అమెరికా ఫిలడెల్ఫిలియా ప్రాంతంలోని కరోనా రోగులపై ఈ అధ్యయనం చేశారు.
కరోనాను జయించిన వారు ఆక్సిజన్ స్థాయిలో తగ్గుదల, జ్వరం వంటి లక్షణాల కారణంగా తిరిగి ఆసుపత్రిలో చేరుతున్నట్లు అమెరికా పెన్సిల్వేనియా స్కూల్ ఆఫ్ మెడిసిన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుడు ఆస్టిన్ కిలారు వివరించారు. ఈ అధ్యయనం ప్రకారం అత్యవసర విభాగంలో చికిత్స పొందిన వారిపై వైద్యులు మరింత దృష్టి సారించవలసి ఉంటుందని కిలారు అభిప్రాయపడ్డారు.