తెలంగాణ

telangana

ETV Bharat / international

అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌ తప్పదేమో!

కరోనా కేసుల పెరుగుదల అమెరికా ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకంగా మారే ప్రమాదముందని హెచ్చరించింది అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్​). విపత్తును అధిగమించేందుకు మరిన్ని ఉద్దీపన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని సూచించింది.

once again shutdown in America once again!
అమెరికాలో మరోసారి షట్‌డౌన్‌ తప్పదేమో!

By

Published : Jul 18, 2020, 12:04 PM IST

అమెరికాలో పెరుగుతున్న కరోనా కేసులు ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణకు ఆటంకంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) హెచ్చరించింది. కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుండడంతో మరోసారి షట్‌డౌన్‌ తప్పకపోవచ్చునని పేర్కొంది. రాబోయే కాలంలో డిమాండ్‌ను పెంచేలా ప్రజలకు ప్రభత్వం మరింత చేయూతనందించాల్సిన అవసరం ఉంటుందని తెలిపింది. అలాగే క్రమంగా విస్తరిస్తున్న పేదరికం, ఆరోగ్య వ్యవస్థలో ఉన్న లోపాలు వంటి సమస్యల్ని అధిగమించేందకు ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని శుక్రవారం విడుదల చేసిన ఓ నివేదికలో సూచించింది.

ఆర్థిక కష్టాలున్నాయ్​!

ఆర్థిక వ్యవస్థను పటిష్ఠపరిచేందుకు అమెరికా అనేక చర్యలు చేపట్టినప్పటికీ.. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి 37 శాతం తగ్గిందని ఐఎంఎఫ్ గుర్తుచేసింది. స్థూలంగా ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 6.6 శాతం కుచించుకుపోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఫ్లోరిడా, జార్జియా, టెక్సాస్‌, కాలిఫోర్నియా వంటి రాష్ట్రాల్లో స్థానికంగా ఇప్పటికే మరోసారి ఆంక్షల్ని విధించిన విషయాన్ని ఐఎంఎఫ్‌ గుర్తుచేసింది. తాజా పరిస్థితులు హిస్పానిక్‌, నల్లజాతీయుల వంటి అల్పాదాయ వర్గాల జీవనంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. వివిధ రంగాల్లో ఇప్పటికే నమోదవుతున్న నష్టాలు పెరుగుతున్న పేదరికాన్ని సూచిస్తున్నాయని తెలిపింది.

మరిన్ని ఉద్దీపన చర్యలు!

రాబోయే కొన్ని నెలల్లో అమెరికా మరో దఫా ఉద్దీపన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఐఎంఎఫ్‌ సూచించింది. డిమాండ్‌కు ఊతమిచ్చేలా, ఆరోగ్య వ్యవస్థ అప్రమత్తతను మెరుగుపరిచేలా, అట్టడుగు వర్గాలకు దన్నుగా నిలిచేలా ఉద్దీపన కార్యక్రమాలు ఉండాలని సూచించింది. ఇప్పటికీ ఆర్థికపరమైన వెసులుబాట్లు ఉన్న కారణంగా వీలైనంత త్వరగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని తెలిపింది. అలాగే ఈ సంక్షోభాన్ని సామాజిక భద్రత వంటి శాశ్వత పరిష్కారాలను చూపేందుకు అవకాశంగా మలచుకోవాలని హితవు పలికింది.

ఇదీ చూడండి:అమెరికా ఎన్నికల్లో రష్యా, చైనా జోక్యం వాస్తవం

ABOUT THE AUTHOR

...view details