అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాలనతో విసిగిపోయిన ఆ దేశ ప్రజల్లో.. బైడెన్ ఇచ్చిన కొత్త హామీలతో ఆశలు చిగురించాయి. అందుకే ఎన్నికల్లో ఆయనకే పట్టం కట్టారు. వాటిని సాకారం చేసే దిశగా ఆయన కార్యాచరణ ప్రారంభించారు. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన తొలిరోజే పలు కీలక కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేసేందుకు సిద్ధమవుతున్నారని వైట్ హౌస్‌లో కాబోయే చీఫ్ ఆఫ్ స్టాఫ్ రోన్ క్లెయిన్ తెలిపారు.
12 దస్త్రాలపై సంతకం..
ప్రమాణ స్వీకారం ముగిసి ఓవల్ ఆఫీస్‌లో బాధ్యతలు చేపట్టిన వెంటనే దాదాపు 12 కీలక దస్త్రాలపై బైడెన్ సంతకం చేయనున్నట్లు రోనీ తెలిపారు. అందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయని వెల్లడించారు. పారిస్ ఒప్పందంలో చేరడం, కొవిడ్ ఆంక్షల్ని విస్తరించడం, ముస్లిం దేశాలకు రాకపోకలపై విధించిన నిషేధాన్ని ఎత్తివేయడం వంటి కీలక అంశాలపై తొలిరోజే బైడెన్ తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్రంప్ నిబంధనల వల్ల పిల్లలకు దూరమైన వలస వచ్చిన తల్లిదండ్రుల విషయంలో బైడెన్ మానవత్వంతో వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. వారంతా తిరిగి కలుసుకునేలా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
4 సంక్షోభాలకు తక్షణ పరిష్కారం
అమెరికాలో కరోనా సంక్షోభం, దాని ఫలితంగా వచ్చిన ఆర్థిక సంక్షోభం, వాతావరణ సంక్షోభం, జాతి వివక్ష సంక్షోభాలు నెలకొన్నాయి. వీటన్నింటిపై అత్యవసర చర్యలు తీసుకొని ప్రపంచంలో దేశ ప్రతిష్ఠను నిలపాల్సి ఉంది. మొదటి పది రోజుల్లోనే వీటిపై కార్యాచరణ ప్రారంభిస్తారు. అందులో భాగంగా ప్రమాణ స్వీకారం రోజున దాదాపు డజను ఉత్తర్వులపై సంతకాలు చేస్తారు.
- కరోనా నియంత్రణలో భాగంగా మాస్కు కట్టుకోవడాన్ని తప్పనిసరి చేయనున్నారు. 'వంద రోజుల మాస్కు ధారణ సవాలు' అనే కార్యక్రమాన్ని అమలు చేయనున్నారు.
- విద్యా రుణాలు, వడ్డీ చెల్లింపుపై ప్రస్తుతం ఉన్న గడువును మరింతగా పొడిగించాలని విద్యాశాఖను ఆదేశించనున్నారు.
- వలస వచ్చిన వారిని గౌరవిస్తూ విధానాల్లో మార్పులు చేయనున్నారు. వీరి వల్లనే అమెరికావారికి అవకాశాలు తగ్గుతున్నాయంటూ 2016లో ట్రంప్ ప్రచారం చేసి అధికారంలోకి రావడం గమనార్హం. ఈ విషయంలో ట్రంప్ విధానాలను పూర్తిగా మార్చనున్నారు. చట్టంలో తగిన సవరణలు సూచిస్తూ కాంగ్రెస్‌కు ప్రతిపాదనలు పంపించనున్నారు. దీని ద్వారా 1.10 కోట్ల మందికి లబ్ధి కలిగే అవకాశం ఉంది.
- రెండో రోజైన జనవరి 21న కరోనా నియంత్రణపై మరిన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. పాఠశాలలు, వ్యాపారాలను సురక్షితంగా పునః ప్రారంభించడంపై ఆదేశాలు వెలువడొచ్చు.
- కరోనా కారణంగా ఆర్థికంగా నష్టపోయిన కుటుంబాలకు తక్షణ సహాయం అందించే విషయమై మంత్రులకు సూచనలు ఇవ్వనున్నారు.
- ఈ నెల 25 నుంచి ఫిబ్రవరి 1 వరకు మరికొన్ని కార్యనిర్వాహక ఉత్తర్వులు ఇవ్వనున్నారు. అమెరికా ఉత్పత్తులను కొనుగోలు చేసేలా ప్రోత్సహిస్తానన్న ఎన్నికల హామీని నెరవేర్చనున్నారు. ‘‘అమెరికా భవిష్యత్తు అమెరికాలోనే తయారు’’ అన్న నినాదాన్ని ఇవ్వనున్నారు.
- క్రిమినల్ న్యాయ విధానంలో సంస్కరణలు చేపట్టి జాతి వివక్ష లేకుండా చూస్తానన్న ఎన్నికల హామీ అమలుపై ఉత్తర్వులు ఇవ్వనున్నారు.
- ప్రభుత్వ పరిపాలనకు నమ్మకాలు కాకుండా శాస్త్ర విజ్ఞానమే మార్గదర్శకం కావాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో భాగంగా వాతావరణ మార్పుల విషయమై ఉత్తర్వులు ఇవ్వనున్నారు. పర్యావరణంపై అంతర్జాతీయంగా కుదిరిన పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరే అవకాశం ఉంది.
- ఆరోగ్య భద్రతను విస్తరించడంతో పాటు ఆర్థికంగా దిగువ వర్గాల మహిళలు, అందులోనూ శ్వేత జాతికి చెందని మహిళల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపనున్నారు.
- కొన్ని ముస్లిం దేశాల వారు రాకుండా విధించిన ఆంక్షలను ఎత్తివేసే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: