అమెరికాలో అల్-ఖైదా ఉగ్రవాదులు(Al Qaeda Attacks) జరిపిన మారణహోమానికి(9/11 Attack) నేటితో 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలో ఆనాటి విధ్వంస కాండలో (9/11 memorial) ప్రాణాలు కోల్పోయిన 2,997 మంది త్యాగాలను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్మరించుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ వీడియోను పోస్ట్ చేశారు. అతి దుర్బలమైన సమయంలోనూ సమైక్య శక్తి గొప్పతనాన్ని ఈ విషాద ఘటన తెలియజేందని పేర్కొన్నారు.
"2001, సెప్టెంబర్ 11న న్యూయార్క్, అర్లింగ్టన్, వర్జీనియా, షాంక్స్విల్లే, పెన్సిల్వేనియాలో జరిగిన ఉగ్రదాడిలో దాడిలో 90 దేశాలకు చెందిన 2,997 మంది ప్రాణాలు విడిచారు. మరో 1000 మందికి పైగా క్షతగాత్రులయ్యారు. వారందరిని, వారి కుంటుబాలను అమెరికా స్మరించుకుంటోంది."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు.
9/11 దాడుల సమయంలో అండగా నిలిచి, సహాయక చర్యలు అందించిన బలగాల సేవలను బైడెన్(Joe Biden) కొనియాడారు. "పోలీసు అధికారులు, అగ్నిమాపక సిబ్బంది, అత్యవసర బృందాలు, భవన నిర్మాణ కార్మికులు, వైద్యులు, నర్సులు, నాయకులు, సేవా సంఘాల సభ్యులు, సహా సహాయక చర్యల్లో పాల్గొని, అమెరికాను కోలుకునేలా చేసి, పునర్నిర్మాణంలో సహకరించిన వారందరినీ అమెరికా ఎంతో గౌరవిస్తోంది" అని బైడెన్ పేర్కొన్నారు.