Omicron variant severity: దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన ఒమిక్రాన్ వేరియంట్ కొద్దిరోజుల వ్యవధిలోనే 57 దేశాలకు వ్యాపించింది. జింబాబ్వే సహా దక్షిణాఫ్రికా దేశాల్లో ఈ వేరియంట్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వైరస్ వ్యాప్తితో ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.
ఒమిక్రాన్ కారణంగా వ్యాధి తీవ్రత ఏస్థాయిలో ఉంటుందో, దానిలోని అసాధారణ మ్యుటేషన్లు టీకా రోగనిరోధక శక్తిని ఏమార్చుతాయా.. అనే విషయంపై స్పష్టతకు మరింత సమాచారం అవసరమని డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. డెల్టా వేరియంట్ కంటే ఒమిక్రాన్ తీవ్రత తక్కువగా ఉన్నప్పటికీ ఎక్కువ మందికి వైరస్ సోకితే, ఆసుపత్రిలో చేరే వారి సంఖ్య పెరుగుతుందని అంచనా వేసింది. రానున్న వారాల్లో ఐరోపాలో కొవిడ్ కారణంగా ఆసుపత్రుల్లో చేరిక, మరణాల సంఖ్య పెరుగుతుందని యూరోపియన్ హెల్త్ ఏజెన్సీ వెల్లడించింది. ప్రస్తుత పరిస్థితులకు ఈ వ్యాక్సినేషన్ రేటు సరిపోదని హెచ్చరించింది.