Omicron Cases Drop: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచదేశాలను పట్టిపీడిస్తోంది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తదితర దేశాల్లో కేసులు రోజురోజుకూ రెట్టింపవుతూ లక్షల మందికి సోకింది. అయితే ఈ అంటువ్యాధి బ్రిటన్లో ఇప్పటికే గరిష్ఠ స్థాయికి చేరుకొని ఉంటుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. అమెరికాలోనూ ఇదే తరహాలో కేసులు ఒక్కసారిగా కిందకు దిగివస్తాయని చెబుతున్నారు.
ఈ కొత్త వేరియంట్ విస్తృతంగా సంక్రమిస్తోంది. వైరస్ మొట్టమొదట బయటపడ్డ దక్షిణాఫ్రికాలోనూ నెలన్నర వ్యవధిలోనే కేసులు విపరీతంగా వచ్చాయి. దాదాపు దేశ ప్రజలందరికీ వైరస్ సోకి ఉంటుందని వైద్య నిపుణులు అంటున్నారు. అక్కడ కొత్త కేసుల సంఖ్య కూడా తగ్గింది. ఇదే తరహాలో ఇతర దేశాల్లోనూ కేసులు తగ్గుముఖం పడతాయని వివరిస్తున్నారు.
''ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఎంతలా విజృంభించిందో.. అదే స్థాయిలో కేసులు పతనం అవుతాయి. అమెరికాలో రోజువారీ కేసులు జనవరి 19 వరకు 1.2 మిలియన్లు ఉండొచ్చు. ఆ తర్వాత క్రమంగా పడిపోతాయి. అప్పటికే అవకాశం ఉన్నవాళ్లందరికీ వైరస్ సోకి ఉంటుంది.''
- అలీ మోక్దాద్, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ ప్రొఫెసర్
Corona Pandemic End: ఇదే సమయంలో కరోనా మహమ్మారి తదుపరి దశ ఎలా ఉంటుందనేదానిపై ఇంకా అనిశ్చితి నెలకొందని నిపుణులు వెల్లడించారు. రానున్న 2-3 వారాలు క్రూరంగా ఉండబోతోందని, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి.. ఐసీయూల్లో చేరే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
COVID-19 cases rose by more than 50%
మరోవైపు... కరోనా వైరస్ కొత్త కేసులు గతవారంలో 50 శాతానికిపైగా పెరిగాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తన నివేదికలో తెలిపింది. ఒక్కవారంలోనే కోటీ 50 లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగు చూశాయని, ఇది అంతకుముందు వారంతో పోలిస్తే సుమారు 55 శాతం ఎక్కువ అని పేర్కొంది. మరణాలు మాత్రం స్థిరంగా(43 వేలకుపైగా) నమోదవుతున్నాయని వెల్లడించింది.