US first Omicron death: అమెరికాలో తొలి ఒమిక్రాన్ మరణం సంభవించింది. టెక్సస్‌కు చెందిన ఓ బాధితుడు ఒమిక్రాన్ సోకి మృతి చెందినట్లు స్థానిక యంత్రాంగం ప్రకటించింది. బాధితుడు టీకాలు తీసుకోలేదని తెలిపింది. పలు వైద్య సమస్యలు కూడా బాధితుడికి ఉన్నాయని వెల్లడించింది. మృతుడి వయసు యాభైలలో ఉందని స్థానిక కౌంటీ జడ్జి లీనా హిడాల్గో తెలిపారు.
Omicron US cases: అమెరికాలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఎక్కువ శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయి. గడిచిన వారంలో నమోదైన కరోనా కేసుల్లో 73 శాతం ఒమిక్రాన్ బారినపడ్డవారేనని వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం వెల్లడించింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వాటా వారం రోజుల్లోనే ఆరు రెట్లు పెరిగిందని తెలిపింది. ఈ కాలంలో 6.5 లక్షల ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి వచ్చాయని వివరించింది.
న్యూయార్క్‌లో నమోదైన కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులే ఉన్నాయి. జూన్ తర్వాతి నుంచి అమెరికాలో డెల్టా వేరియంట్ తీవ్రంగా వ్యాపిస్తోంది. నవంబర్ వరకు ఈ వేరియంట్ కేసులే అధికంగా ఉన్నాయి. బయటపడిన మొత్తం కేసుల్లో 99.5 శాతం డెల్టా వేరియంట్‌వే ఉన్నాయని సీడీసీ డేటా వెల్లడిస్తోంది.