Omicron variant vaccine effectiveness: కొవిడ్-19 కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్'పై ప్రస్తుత వ్యాక్సిన్లు పని చేస్తాయా లేదా అనే సందిగ్ధంలో ఉన్న తరుణంలో.. ఓ అధ్యయనం పిడుగులాంటి విషయాన్ని వెల్లడించింది. కొవిడ్ వ్యాక్సిన్లు, యాంటీబాడీ థెరపీల ద్వారా లభించే రక్షణ నుంచి ఒమిక్రాన్ తప్పించుకోగలదని పేర్కొంది. సార్స్ కోవ్-2 వైరస్ భవిష్యత్తులో ఎలా అభివృద్ధి చెందుతుందో అంచనా వేస్తూ కొత్త టీకాలు, చికిత్సలు రూపొందించడం అవసరమని పేర్కొంది.
అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం, హాంగ్‌కాంగ్ యూనివర్సిటీ పరిశోధకులు ఒమిక్రాన్ వేరియంట్‌పై అధ్యయనం చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ పరిశోధన నేచర్ జర్నల్‌లో ప్రచురితమైంది.
కొత్త వేరియంట్ స్పైక్ ప్రోటీన్‌లో చాలా మార్పులు జరుగుతున్నాయని, నాలుగు మ్యుటేషన్లను గుర్తించినట్లు చెప్పారు పరిశోధకులు. అందువల్లే.. ప్రస్తుత వ్యాక్సిన్లు, థెరపీ యాంటీబాడీలను తట్టుకుని వేగంగా వ్యాప్తి చెందగలుగుతోందని పేర్కొన్నారు. ఒమిక్రాన్‌ను తటస్థపరిచేందుకు వ్యాక్సిన్ల ద్వారా ఉత్పత్తి అయిన యాంటీబాడీల సామర్థ్యాన్ని ల్యాబ్‌లో పరీక్షించారు పరిశోధకులు. ఈ క్రమంలో మోడెర్నా, ఫైజర్, ఆస్ట్రాజెనెకా, జాన్సన్ అండ్ జాన్సన్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారి యాంటీబాడీలు.. కొవిడ్‌తో పోలిస్తే ఒమిక్రాన్‌ను తటస్థీకరించటంలో ప్రభావం చూపలేకపోతున్నాయని గుర్తించారు. అలాగే.. గతంలో వైరస్ బారిన పడిన వారి యాంటీబాడీలు సైతం ఒమిక్రాన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోతున్నాయని పేర్కొన్నారు.
అయితే, ఫైజర్, మోడెర్నా వ్యాక్సిన్ బూస్టర్ డోస్ తీసుకున్న వారికి రక్షణ కాస్త ఎక్కువగా ఉంటుందని తెలిపారు పరిశోధకులు.
" తాజా అధ్యయనం ప్రకారం గతంలో వైరస్ బారిన పడిన వారు, పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ వేసుకున్న వారు సైతం ఒమిక్రాన్ వేరియంట్ బారినపడే ప్రమాదం ఉంది. బూస్టర్ డోసు సైతం ఒమిక్రాన్ నుంచి పూర్తిస్థాయిలో రక్షణ కల్పించలేకపోతోంది. కానీ, బూస్టర్ తీసుకోవటం మంచిదని మా సలహా. దాని ద్వారా రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. "