America covid cases: కరోనా మహమ్మారి మరోమారు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. అగ్రరాజ్యంలో రోజుకు లక్షల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 5.67 లక్షల మందికి వైరస్ సోకింది. 1,847 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రుల్లో లక్షకుపైగా బాధితులు చికిత్స పొందుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. రోగులతో నిండిపోయి.. పడకలు దొరక్క రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది.
95 శాతం కేసులు ఒమిక్రాన్‌వే..
America Omicron variant: అమెరికాలో వైరస్ బారినపడుతున్న వారిలో 95శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటాయని భావిస్తున్నట్లు తెలిపారు అమెరికా ఆరోగ్య శాఖ అధికారులు. కొవిడ్-19 వైరస్లల్లో ఏ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతునే అంశాన్ని పరిశీలించిన వ్యాధుల నియంత్రణ, నిర్మూలన కేంద్రం(సీడీసీ).. ఈ మేరకు తెలిపింది. గత ఏడాది జూన్‌లో కొత్త కేసులకు డెల్టా వేరియంట్ కారణంగా కాగా.. నవంబర్‌తో తగ్గిపోయినట్లు పేర్కొంది. తాజాగా.. ఒమిక్రాన్ వేరియంట్ ఆ స్థానాన్ని తీసుకున్నట్లు పేర్కొంది.
మరోవైపు.. కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు ప్రముఖ అంటువ్యాధుల నిపుణులు ఆంటోనీ ఫౌచీ. లక్షణాలు లేని కేసులే ఎక్కువగా ఉన్న ప్రస్తుత సమయంలో ఆసుపత్రుల్లో చేరుతున్న వారిపై దృష్టిసారించటం సరైనదని పేర్కొన్నారు. అయితే, కొందరు నిపుణులు దీనిని వ్యతిరేకించారు. కేసులు భారీగా పెరుగుతుండటంపై ఆందోళన వ్యక్తం చేశారు. గత రెండు వారాలుగా అమెరికాలో రోజుకు సగటున 4.80 లక్షల కేసులు నమోదవుతున్నాయి. దీంతో పాఠశాలలు, ఆసుపత్రులు, విమానాయన సంస్థలు సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్నాయి.
గత వారం రోజుకు సగటున 14,800 మంది ఆసుపత్రిలో చేరారు. అంతకు ముందు వారంతో పోలిస్తే 63 శాతం అధికం. అయితే, గత ఏడాది గరిష్ఠ స్థాయి 16,500లో పోలిస్తే కాస్త ఊరట కలిగించే విషయం. గత రెండు వారాలుగా మరణాలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గత ఏడాది జనవరి(3,400)తో పోలిస్తే.. ప్రస్తుతం రోజుకు సగటున 1,200 మరణాలు సంభవిస్తున్నాయి.
ఫ్రాన్స్‌లో ఒక్కరోజే.. 2.71లక్షల కేసులు