అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ఈ నెల 20న నిర్వహించే అంతరిక్ష యాత్రలో రెండు అరుదైన రికార్డులు నమోదు కానున్నాయి. ఈ కుబేరుడితో కలిసి 18 ఏళ్ల ఆలివర్ డేమన్ రోదసియాత్ర చేయబోతున్నారు. దీంతో అంతరిక్షంలోకి వెళుతున్న అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన గుర్తింపు పొందబోతున్నారు. అదే యాత్ర కోసం ఇప్పటికే ఎంపికైన వేలీ ఫంక్ (82).. అత్యంత ఎక్కువ వయసున్న వ్యోమగామి కానున్నారు.
ఈ యాత్ర కోసం బెజోస్‌కు చెందిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష సంస్థ నిర్వహించిన వేలంలో ఏకంగా 2.8 కోట్ల డాలర్లకు ఓ ధనికుడు టికెట్ సంపాదించారు. అయితే ఇతరత్రా పనుల కారణంగా ఆయన తన యాత్రను వాయిదా వేసుకున్నారు. దీంతో ఆ సీటును ఆలివర్‌కు కేటాయించారు. ఇందుకు ఆ కుర్రాడు ఎంత చెల్లించాడన్నది ఇంకా వెల్లడి కాలేదు. 'న్యూ షెపర్డ్' వ్యోమనౌకలో అమెరికాలోని పశ్చిమ టెక్సాస్ నుంచి ఈ యాత్ర నిర్వహించనున్నారు. 2020లో హైస్కూల్ చదువును పూర్తిచేసుకున్న ఆలివర్.. ప్రైవేటు పైలట్ లైసెన్సు కోసం ఏడాది పాటు చదువుకు బ్రేక్ ఇచ్చారు. నెదర్లాండ్స్‌లోని ఉట్రెక్ట్ విశ్వవిద్యాలయంలో చేరనున్నారు.