కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. ముఖ్యంగా అమెరికాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటి వరకు యూఎస్‌లో 28 లక్షలకుపైగా ప్రజలు కరోనా బారిన పడగా.. 1.32లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రజలు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఎక్కడ తమకు కరోనా సోకుతుందోనని జనాలు ఇళ్ల నుంచి బయటకు రావడానికే భయపడుతుంటే.. అమెరికాలోనే కొందరు విద్యార్థులు ఏకంగా కరోనాతో చెలగాటమాడుతున్నారు. పార్టీలు నిర్వహిస్తూ.. వైరస్ మహమ్మారి ముందు కుప్పి గంతులు వేస్తున్నారు.
అమెరికాలోని అలబామాలో కొందరు విద్యార్థులు 'కొవిడ్-19' పార్టీలు నిర్వహిస్తున్నారు. ఈ పార్టీకి విద్యార్థులతో పాటు కరోనా సోకిన వారిని ఆహ్వానిస్తున్నారు. అందరూ ఓ కుండలో డబ్బులు వేసి.. ఈ పార్టీలో పాల్గొన్న వారిలో కరోనా ఉన్న వారి నుంచి ఎవరికి మొదట కరోనా సోకుతుందో వారికి ఆ కుండలోని డబ్బంతా చెందుతుందని నిబంధన పెట్టుకొని మరీ పార్టీలు జరుపుకొంటున్నారట. ఈ విషయాన్ని టుస్కాలుసా నగర కౌన్సిలర్ సోన్యా మెక్‌కిన్‌స్ట్రీ వెల్లడించారు. "ఇలా పార్టీలు నిర్వహించే వారికి బుద్ధిలేదు. కావాలనే వారు కరోనాను వ్యాప్తి చెందేలా చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇలాంటి వ్యక్తులు ఉండటం వల్ల మనం కరోనాతో ఎలా పోరాడగలం"అని ఆవేదన వ్యక్తం చేశారు.