అమెరికా అధ్యక్ష పదవి కోసం రెండోసారి పోటీపడుతున్నారు డొనాల్డ్ ట్రంప్. గురువారం ఆయన నామినేషన్‌ను అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో ట్రంప్ ప్రసంగించారు. ఈ వేదికపై ప్రత్యర్థి జో బైడెన్ సహా తన 47 ఏళ్ల రాజకీయ రికార్డుల గురించి ప్రస్తావించారు. డెమొక్రాట్లను 'ఆల్ట్రా రాడికల్ లెఫ్ట్'గా అభివర్ణించిన ట్రంప్.. జాత్యహంకారం, నల్లజాతీయుల సమస్యల పేరిట డెమొక్రాట్ నియంత్రణలో ఉన్న మిన్నియాపొలిస్ లేదా కేనోషాలో ఘర్షణలు ఎందుకు జరిగాయని ప్రశ్నించారు.
"అమెరికా చరిత్రలోనే ఇవి చాలా ముఖ్యమైన ఎన్నికలు. గతంలో ఎప్పుడూ రెండు పార్టీలు, రెండు విజన్లు, రెండు ఫిలాసఫీలు, రెండు అజెండాల మధ్య స్పష్టమైన ఎంపిక ఓటర్లకు ఉండేది కాదు. అమెరికన్ కలను రక్షించుకోవాలా? లేదంటే సోషలిస్ట్ ఎజెండాకు అనుమతి ఇచ్చి నాశనం చేసుకోవాలా? అనేది మీరే నిర్ణయించుకోండి"
-- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
"అమెరికన్ల జీవన విధానాన్ని కాపాడే రిపబ్లికన్లకా ఓటు? లేదంటే ఒక రాడికల్ ఉద్యమానికి ఊతమిచ్చి దేశాన్ని నాశనం చేసే వాళ్లకు అనుమతిస్తారా? అనేది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయని'' ట్రంప్ అన్నారు.
"డెమొక్రాట్ నేషనల్ కన్వెన్షన్‌లో మాట్లాడిన జో బైడెన్ అమెరికాలో జాతి, ఆర్థిక, సామాజిక అన్యాయం గురించే ప్రస్తావించారు. ఈ రాత్రి నేను మిమ్మల్ని చాలా సులభమైన ప్రశ్న అడుగుతున్నాను. మన దేశాన్ని కూల్చివేసేందుకు ఎక్కువ సమయం కేటాయిస్తున్న డెమొక్రాట్ పార్టీ.. దేశాన్ని నడిపిస్తామని ఎలా అధికారం అడగగలదు?" అని ట్రంప్ తన 71 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో ప్రశ్నల వర్షం కురిపించారు.
విమర్శలే విమర్శలు...
బహిరంగ సభ రూపంలో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ జరగ్గా.. గతవారం వర్చువల్‌గా డెమొక్రాట్ కన్వెన్షన్ నిర్వహించారు. ఎంతో పేరున్న, అధ్యక్షులకు నెలవైన వైట్‌హౌస్‌ను ట్రంప్ రాజకీయ కార్యక్రమానికి వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నవంబర్లో అధ్యక్ష ఎన్నికల ఫలితాలను నిర్ణయించే ప్రధాన సమస్యలు ఏంటి? ట్రంప్ ప్రసంగంపై అభిప్రాయం.? వంటి అంశాలపై 'బ్యాటిల్గ్రౌండ్యూఎస్ఏ2020' పేరిట చర్చా కార్యక్రమం నిర్వహించారు సీనియర్ జర్నలిస్ట్ స్మితా శర్మ. ఇందులో రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్ సహా ట్రంప్ ప్రసంగంపై నిపుణులు అభిప్రాయమిదే.
" దాదాపు 1500 మంది వైట్‌హౌస్ దగ్గర సమావేశమయ్యారు. వారిలో ఒక్కరూ మాస్కు ధరించలేదు. అది కచ్చితంగా గమనించాల్సిన అంశం. భౌతిక దూరం అనేదే లేదు. ప్రస్తుతం మహమ్మారి లేనట్లు కరోనా ఎప్పుడిదో అనేలా ఓ వక్త మాట్లాడారు. ఇదంగా వాస్తవికతకు దూరంగా, వేరే ప్రపంచంలా అనిపించింది. వైట్‌హౌస్ ముఖద్వారం వద్ద నిరసనకారులు లోపలికి రాకుండా పోలీసులు గేట్ల వద్ద రక్షణగా ఉన్నారు. అది చూశాక రెండు దేశాల మధ్య ఉన్నట్లు అనిపించింది. కొంత కాలంగా పరిస్థితులు అలానే ఉన్నా.. ఈరోజు అది స్పష్టంగా తెలిసింది"
-- సీమా సిరోహీ, సీనియర్ జర్నలిస్ట్ అండ్ కాలమిస్ట్, వాషింగ్టన్ డీసీ
'ఓపెన్ ఎంబ్రాస్: ఇండో-యూఎస్ టైస్ ఇన్ ద ఏజ్ ఆఫ్ మోదీ అండ్ ట్రంప్' అనే పుస్తకం రాసిన వర్గీస్ కూడా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
"అమెరికా అంటే ఏమిటి? ట్రంప్ దృక్పథంలో అది ఎలా ఉండాలి అనే దాని గురించి ఈ రోజు ఓ కథ విన్నాం. కొన్ని రోజుల క్రితం అమెరికా అంటే ఏమిటో బైడెన్ ప్రచారంలోనూ ఓ కథ విన్నాం. ఒకే స్థాయిలో రెండు ప్రసంగాలు ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు. కానీ వారి కథలకు ఎవరికి మెజారిటీ మద్దతు లభిస్తుందనేది ఎన్నికే నిర్ణయిస్తుంది"