తెలంగాణ

telangana

ETV Bharat / international

'ప్రమాణ స్వీకారానికి గర్వంగా వెళతా' - కమలా హారిస్ ప్రమాణస్వీకారం

ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేసేందుకు గర్వంగా వేదిక వద్దకు వెళ్తానని కమలా హారిస్ పేర్కొన్నారు. కార్యక్రమానికి భద్రతా ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఇటీవలి పరిణామాలు చూస్తుంటే.. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఆశయాల సాధన కోసం ఇంకా పోరాడాల్సి ఉందన్న విషయం అర్థమవుతోందన్నారు.

"Not Going To Be Easy": Kamala Harris On Challenges Facing US
'ప్రమాణస్వీకారానికి గర్వంగా వెళతా'

By

Published : Jan 20, 2021, 5:24 AM IST

దేశ పాలనా బాధ్యతలు స్వీకరించనున్న తమకు ముందున్నది అంత సులభమైన మార్గమేమీ కాదని అమెరికాకు కాబోయే ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ అభిప్రాయపడ్డారు. రానున్న రోజుల్లో అధ్యక్షుడిగా బైడెన్‌, ఆయన బృందం ఎదుర్కోనున్న సవాళ్లను ఆమె వివరించారు. అయితే, వాటిని సమర్థంగా ఎదుర్కోవడానికి తామంతా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దేశాన్ని గాడిన పెట్టేందుకు చేయాల్సింది చాలా ఉందని అభిప్రాయపడ్డారు. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ స్మారకార్థం ఏటా జరుపుకొనే 'నేషనల్‌ డే ఆఫ్‌ సర్వీస్‌' కార్యక్రమంలో మంగళవారం పాల్గొన్న ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

'ఆశయాలు చేరుకుంటాం'

ఇప్పటికే వ్యాక్సినేషన్‌, ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజం, ప్రజలకు ఉపాధి కల్పించడం, మహమ్మారి నుంచి దేశాన్ని కాపాడడం వంటి వాటిపై బైడెన్‌ తన ప్రణాళికను ప్రకటించారని కమలా హారిస్‌ తెలిపారు. అయితే, కొంతమంది తమ లక్ష్యాలను విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. కానీ, తమ కృషికి చట్టసభ సభ్యుల సహకారం, సమన్వయం తోడైతే ఆశయాలను చేరుకోవడంలో సఫలీకృతం అవుతామని విశ్వాసం వ్యక్తం చేశారు.

'తలెత్తుకొని వెళ్తా'

ప్రమాణస్వీకార కార్యక్రమానికి భద్రతా ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 'కార్యక్రమానికి వెళ్లడం క్షేమమే అని మీరు భావిస్తున్నారా?' అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కమల తనదైన శైలిలో సమాధానమిచ్చారు. 'ఈ దేశ తదుపరి ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. అందుకోసం ప్రమాణం చేసేందుకు వేదిక వద్దకు తలెత్తుకొని గర్వంగా నడుచుకుంటూ వెళతాను' అని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు చూస్తుంటే.. మార్టిన్‌ లూథర్‌ కింగ్‌ ఆశయాల సాధన కోసం ఇంకా పోరాడాల్సి ఉందన్న విషయం అర్థమవుతోందన్నారు.

అమెరికాలో నేటికీ ప్రతి ఆరు కుటుంబాల్లో ఒకటి ఆకలితో అలమటిస్తోందని కమల తెలిపారు. అలాగే ప్రతి ఐదిళ్లలో ఒకటి నెల అద్దె చెల్లించలేని పరిస్థితిలో ఉందన్నారు. ఇక ప్రతి మూడు కుటుంబాల్లో ఒకటి కనీస నిత్యావసర వస్తువుల బిల్లులు కట్టే స్థితిలో లేదని వివరించారు. ఈ నేపథ్యంలో యావత్తు దేశం ఏకతాటిపై నిలబడి ఈ రుగ్మతల్ని రూపుమాపాల్సిన అవసరం ఉందన్నారు. జవనరి 20న బైడెన్‌ అధ్యక్షుడిగా.. కమలా హారస్‌ ఉపాధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లరిమూకలు విధ్వంసం సృష్టించే ప్రమాదం ఉందన్న సంకేతాల నేపథ్యంలో రాజధాని నగరం వాషింగ్టన్‌లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చదవండి:చీరకట్టుతో కమలా హారిస్‌ ప్రమాణ స్వీకారం?

ABOUT THE AUTHOR

...view details