తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికాతో అణు చర్చలు జరిపే ఆలోచనే లేదు' - america vs north korea

అగ్రరాజ్యం అమెరికా తమపై శత్రుత్వ భావన విడిచిపెట్టేంత వరకు... అణు చర్చలు జరిపే అవకాశం లేదని ఉత్తర కొరియా తేల్చిచెప్పింది. గత శిఖరాగ్ర సమావేశాల్లో చేసుకున్న ఒప్పందాలను పట్టించుకోకుండా.. తమ పట్ల శత్రు భావం ప్రదర్శిస్తున్న అగ్రరాజ్యంతో చర్చలు సాధ్యమేనా? అని ప్రశ్నించింది.

North Korea says it has no plans for talks with US
అమెరికాతో అణు చర్చలు జరిపే ఆలోచన లేదు: ఉత్తర కొరియా

By

Published : Jul 4, 2020, 1:29 PM IST

ప్రస్తుతం అమెరికాతో అణుచర్చలు జరిపే ఆలోచన ఏమీ లేదని ఉత్తర కొరియా తేల్చిచెప్పింది. తమపై అగ్రరాజ్యం శత్రుత్వ భావన విడిచిపెట్టేంత వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందని స్పష్టం చేసింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాజీ జాతీయ భద్రతా సలహాదారు జాన్ బోల్టన్ విలేకరులతో మాట్లాడుతూ... ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్​తో ట్రంప్ మరో శిఖరాగ్ర సమావేశం నిర్వహించే అవకాశముందని పేర్కొన్నారు. బహుశా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు అంటే అక్టోబర్​లో ఈ సమావేశం జరిగే అవకాశముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఉత్తర కొరియా మొదటి ఉప విదేశాంగమంత్రి చో సోన్ హుయ్ భిన్నంగా స్పందించారు. ప్రస్తుతానికి అగ్రరాజ్యంతో అణు చర్చలు జరిపే ఆలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు.

"గత శిఖరాగ్ర సమావేశాల్లో చేసుకున్న ఒప్పందాలను పట్టించుకోకుండా, 'డెమొక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్​ కొరియా' పట్ల శత్రుత్వ వైఖరి ప్రదర్శిస్తున్న అమెరికాతో చర్చలు జరపడం సాధ్యమేనా?"

- చో సోన్ హుయ్​, ఉత్తర కొరియా మొదటి ఉప విదేశాంగమంత్రి

చర్చలకు బ్రేక్​

2018 నుంచి ఇప్పటి వరకు కిమ్, ట్రంప్ మూడు సార్లు అణు చర్చలు జరిపారు. అయితే గతేడాది వియత్నాంలో జరిగిన రెండో శిఖరాగ్ర సమావేశం విఫలమైంది. ఉత్తర కొరియాపై విధించిన ఆంక్షలను పాక్షికంగా కాకుండా పూర్తిగా తొలగించాలని కిమ్ కోరారు. అయితే ట్రంప్ దీనికి ససేమిరా అనడం వల్ల చర్చలు విఫలమయ్యాయి.

మరోవైపు కిమ్ కూడా అంతే గట్టిగా తన తన వాదం వినిపించారు. అమెరికా ఎన్ని ఆంక్షలు పెట్టినా, ఎంత ఒత్తిడి తెచ్చినా తమ అణు కార్యక్రమం నిలిపివేసేది లేదని తేల్చిచెప్పారు.

అమెరికా నాయకత్వం మారేవరకు..

నవంబర్​లో అమెరికా అధ్యక్ష అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. కొంత మంది విశ్లేషకుల ప్రకారం.. కనీసం అప్పటివరకు అగ్రరాజ్యంతో అణు చర్చలు జరపకూడదని ఉత్తర కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అగ్రరాజ్య నాయకత్వం మారే అవకాశముండడమే.

దక్షిణ కొరియాపైనా ఒత్తిడి

ఇటీవలి కాలంలో దాయాది దక్షిణ కొరియాపై కూడా ఉత్తర కొరియా ఒత్తిడి పెంచింది. తన భూభాగంలోని ఇంటర్ కొరియన్ కార్యాలయాన్ని పేల్చివేసింది. ద్వైపాక్షిక సైనిక ఒప్పందాన్ని కూడా రద్దు చేసుకుంటామని హెచ్చరించింది.

ఇదీ చూడండి:దృష్టంతా కరోనా 1.0 కట్టడిపైనే: డబ్ల్యూహెచ్ఓ

ABOUT THE AUTHOR

...view details