దూకుడుగా ఉండే తన వ్యవహార శైలికి భిన్నంగా.. అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ నిష్పక్షపాతంగా స్వీయ విమర్శ చేసుకున్న అరుదైన సందర్భం తాజాగా చోటుచేసుకుంది. శ్వేత సౌధంలో మంగళవారం జరిగిన ఓ సమావేశంలో... అమెరికా ప్రజలు అంటువ్యాధుల నిపుణుడు ఆంటోనీ ఫౌచీ కంటే తనను ఎందుకు తక్కువ ఇష్టపడుతున్నారో అని ఆయన ప్రశ్నించారు. తానంటే ఎవరికీ ఇష్టం లేదని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు.
"ఫౌచీని మా ప్రభుత్వమే నియమించింది. కొవిడ్-19 నియంత్రణకై డాక్టర్ ఫౌచీ, డాక్టర్ బిర్క్స్ సహా వైద్య నిపుణుల బృందం సూచనలనే మా ప్రభుత్వం అమలు చేస్తోంది. అయితే, కరోనా విషయంలో ఫౌచీకి అమిత ప్రజాదరణ లభిస్తోంది. అసలు నాకే అత్యధిక మద్దతు రావాల్సి ఉండగా.. విమర్శలు ఎందుకు ఎదురౌతున్నాయో అర్థం కావటం లేదు. మా (ప్రభుత్వం) కోసం పనిచేసే వ్యక్తికి ప్రజాదరణ లభిస్తుండగా... నన్ను ఎవరూ ఇష్టపడకపోవడానికి నా వ్యక్తిత్వమే కారణం. అంతే."
- డొనాల్డ్ ట్రంప్