అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు భావిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇప్పటివరకు ఏ ఒక్కరు ప్రాణాలు కోల్పోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. చాలా దేశాల్లో ఇప్పటికే కొత్త వేరియంట్ విస్తరించినప్పటికీ.. ఏ దేశంలోనూ ఒమిక్రాన్‌తో మరణించిన దాఖలాలు లేవని స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ వేరియంట్‌ను ఆందోళకర రకంగా ప్రకటించిన డబ్ల్యూహెచ్‌ఓ.. వైరస్ తీవ్రతకు సంబంధించి మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నట్లు పేర్కొంది.
"ఒమిక్రాన్ వేరియంట్ ఇప్పటికే చాలా దేశాలకు వ్యాపించింది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు.. కొవిడ్ నిర్ధారణ పరీక్షలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ సందర్భంగా ఈ వేరియంట్ కేసుల సంఖ్య కూడా పెరుగుతోంది. వైరస్ తీవ్రతకు సంబంధించిన అదనపు సమాచారం వస్తుంది. ఈ సమయంలో కొన్నిచోట్ల మరణాలకు సంబంధించిన సమాచారం కూడా రావచ్చు" అని డబ్ల్యూహెచ్‌ఓ అధికార ప్రతినిధి క్రిస్టియన్ లిండ్‌మెయిర్ వెల్లడించారు.