ప్రపంచంలోని అనేక రంగాలపై కరోనా ఎనలేని ప్రభావం చూపింది. ఎన్నో సంస్థలు అనేక నష్టాలను మూటగట్టుకున్నాయి. అయితే అన్నింటికీ మినహాయింపు ఉన్నట్లే.. కరోనా సమయంలోనూ భారీగా వృద్ధి చెందిన రంగాలు ఉన్నాయి. అందులో ఆయుధ తయారీ రంగం ఒకటి.
అవును.. 2020లో ఈ రంగం కొత్తపుంతలు తొక్కింది. ఆయుధాలు, మిలిటరీ వ్యవస్థలు, పరికరాలు తయారు చేసే సంస్థలు ఈ కాలంలో గణనీయంగా వృద్ధి సాధించాయి. 'డిఫెన్స్న్యూస్' అనే వెబ్సైట్ ప్రకారం ప్రపంచంలోని టాప్ 100 డిఫెన్స్ సంస్థల్లో అనేకం లాభాల్లోనే పయనించాయి. ఈ జాబితాలో అమెరికా, చైనా దేశాలదే హవా. అతిపెద్ద 20 రక్షణ సంస్థల్లో ఎనిమిది అమెరికా, ఏడు చైనాలవే కావడం.. ఈ రంగంలో ఆయా దేశాల ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తోంది. ఇటలీ, రష్యా, ఫ్రాన్స్ దేశాలకు చెందిన ఒక్కో సంస్థకు ఇందులో చోటు దక్కింది. ఫ్రాన్స్-నెదర్లాండ్స్ దేశాల జాయింట్ వెంచర్ సంస్థకు సైతం స్థానం లభించింది.
భారీగా పెరిగిన రెవెన్యూ
2020 ఏడాదిలో అమెరికాకు చెందిన పది అతిపెద్ద సంస్థల్లో ఆరు కంపెనీల రెవెన్యూ కనీసం 6 శాతం పెరిగింది. దాదాపు 11 బిలియన్ డాలర్లను ఇవి వెనకేసుకున్నాయి. చైనా కంపెనీలు సైతం మెరుగ్గా రాణించాయి.
ఈ జాబితా ప్రకారం అమెరికాలోని ఐదు ఉత్తమ రక్షణ రంగ కంపెనీలు ఇవే..
- లాక్‌హీడ్ మార్టిన్
- రేథియాన్ టెక్నాలజీస్
- బోయింగ్
- నార్త్రాప్ గ్రూమన్
- జనరల్ డైనమిక్స్
చైనాలో లీడింగ్ డిఫెన్స్ కంపెనీలు:
- ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా
- చైనా నార్త్ ఇండస్ట్రీస్ గ్రూప్
- చైనా స్టేట్ షిప్‌బిల్డింగ్ కార్పొరేషన్
- చైనా ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్
భారత్ నుంచి...
టాప్ 100 జాబితాలో భారత్ నుంచి రెండు సంస్థలు ఉన్నాయి. దేశీయ దిగ్గజ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ 41వ స్థానంలో నిలిచింది. గతేడాది(45)తో పోలిస్తే నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుంది. భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ర్యాంకులో ఎలాంటి మార్పు లేదు. గతేడాది తరహాలోనే ఈసారీ 61వ స్థానాన్ని దక్కించుకుంది.