తెలంగాణ

telangana

ETV Bharat / international

'అమెరికాకు భారత్​కన్నా ఎవరూ ముఖ్యం కాదు' - No nation more important than India: US tech think tank

ద్వైపాక్షిక సంబంధాల విషయంలో అమెరికాకు భారత్​కన్నా మరే దేశం ముఖ్యం కాదని అగ్రరాజ్యానికి చెందిన ఓ మేధో సంస్థ పేర్కొంది. ఇరు దేశాలు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రపంచంలో రెండు భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని తెలిపింది. భారత్​లోని సంస్థలపై అమెరికా కంపెనీలు ఆధారపడటం వల్ల ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది.

india us relations, india important nation to us, us think tank report
అమెరికా మేధో సంస్థ భారత్​ అమెరికా సంబంధాలు, భారత్​ అమెరికాకు ముఖ్యమైన దేశం, భారత్ అమెరికా సంబంధాలు

By

Published : Apr 13, 2021, 3:48 PM IST

చైనాకు కళ్లెం వేయాలని ప్రయత్నిస్తున్న అమెరికాకు భారత్​ కన్నా మరే ఇతర దేశం ముఖ్యం కాదని అగ్రరాజ్యానికి చెందిన ఓ మేధో సంస్థ స్పష్టం చేసింది. భౌగోళిక పరిమాణం, నైపుణ్యం కలిగిన నిపుణులు, బలమైన రాజకీయ, సాంస్కృతిక సంబంధాలు వంటి అంశాలు ద్వైపాక్షికంగా భారత్​ను అమెరికాకు అత్యంత కీలకమైన దేశంగా మార్చాయని పేర్కొంది.

ఈ మేరకు వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ ఫౌండేషన్(ఐటీఐఎఫ్)కు చెందిన డేవిడ్ మోషెల్లా, రాబర్ట్ అట్కిన్​సన్... ప్రపంచ భౌగోళిక రాజకీయ పరిస్థితులను సమీక్షిస్తూ ఓ నివేదిక రూపొందించారు. బైడెన్, మోదీ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను బట్టి ప్రపంచంలో రెండు భిన్నమైన పరిస్థితులు నెలకొంటాయని వివరించారు.

ఇదీ చదవండి:బైడెన్​ గెలుపు.. భారత్​- అమెరికాకు కొత్త మలుపు

మొదటి విధానంలో..'భారత్, చైనా మధ్య ఉద్రిక్తతలు తగ్గి.. వ్యాపార సంబంధాలు కొత్త పుంతలు తొక్కుతాయి. తయారీ రంగంలో చైనాకు ఉన్న బలాలు, సాఫ్ట్​వేర్-సేవల రంగంలో భారత్​కు ఉన్న నైపుణ్యాలతో ప్రపంచవ్యాప్తంగా వ్యాల్యూ చైన్ సామర్థ్యాలను ఇరు దేశాలు బలోపేతం చేస్తాయి. వీటితో పోలిస్తే మార్కెట్ సామర్థ్యం తక్కువగా ఉన్న అమెరికా.. ఆయా దేశాలపై ఆధారపడటాన్ని కొనసాగిస్తుంది. ఫలితంగా ఇరు దేశాలతో వాణిజ్య లోటు భారీగా పెరుగుతుంది. ఈ పరిణామాలు చైనా-భారత్​కు చెందిన కంపెనీలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు.. ప్రపంచంలో మేటిగా ఎదిగేందుకు దారితీస్తాయి. భారత్-చైనాతో పోలిస్తే చిన్న మార్కెట్ కావడం, వాటిపై అధికంగా ఆధారపడటం వల్ల.. అమెరికా చేసేదేమీ ఉండదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తూర్పు దేశాలవైపు కేంద్రీకృతమవుతుంది' అని నివేదిక వివరించింది.

ఇదీ చదవండి:భారత్​ ఓ నిజమైన మిత్ర దేశం: అమెరికా

రెండో దృష్టాంతంలో..'ఆర్థిక, సైనిక, అంతర్జాతీయ సంబంధాల విషయంలో చైనా నుంచి ఎదురవుతున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకొని భారత్, అమెరికా దేశాల ప్రయోజనాలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. చైనా నుంచి తరలివెళ్తున్న తయారీ సంస్థలు భారత్​లో పెట్టుబడులు పెడుతున్నాయి. ఇటీవల గణనీయంగా వృద్ధి చెందుతున్న భారత తయారీ రంగం.. చైనాపై అమెరికా ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. చైనా వృద్ధి నెమ్మదిస్తుంది. అదే సమయంలో భారత్​కు చెందిన విద్యార్థులు అమెరికాకు వచ్చి ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు సహకారం అందిస్తూ ఉంటారు. భారత సంతతి ప్రజలు ఇరుదేశాల మధ్య మరింత బలమైన సంబంధాన్ని ఏర్పాటు చేస్తారు' అని నివేదిక వివరించింది.

ప్రయోజనాలే అధికం!

భారత్​లోని సాంకేతిక, సేవా సంస్థలపై అమెరికా కంపెనీలు ఆధారపడటం వల్ల ప్రతికూలతల కన్నా ప్రయోజనాలే ఎక్కువగా ఉన్నాయని నివేదిక అభిప్రాయం వ్యక్తం చేసింది. దీని వల్ల భారత్​లోని అమెరికా దిగ్గజ సాంకేతిక సంస్థలు తమ సేవలను మెరుగుపర్చుకునే వీలు ఉంటుందని తెలిపింది. క్రమంగా ఇరుదేశాల ఎగుమతులు ఒకేస్థాయికి చేరుతాయని, తద్వారా రెండు దేశాలు అభివృద్ధి సాధిస్తాయని పేర్కొంది.

కలికట్టుగా కట్టడి చేస్తే..

అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, తైవాన్ దేశాల సైనిక సామర్థ్యం చైనాను నిలువరించేందుకు సరిపోతుందని ఐటీఐఎఫ్ తెలిపింది. రెండో విధానంలో ప్రజాస్వామ్య దేశాలు మరింత కాలం వర్ధిల్లుతాయని వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాలన్నీ 'బీజింగ్ విధానాన్ని' ​వదిలి 'దిల్లీ విధానం' వైపు అడుగులు వేస్తాయని తెలిపింది. అయితే.. చైనాలోని తయారీ సంస్థలు భారత్​కు తరలి వచ్చేలా అమెరికా-భారత్ ప్రయత్నిస్తున్నప్పటికీ.. గణనీయమైన మార్పులు రావడానికి సమయం పడుతుందని ఐటీఐఎఫ్ పేర్కొంది. ఇప్పటికీ చైనాకు అనేక ప్రయోజనాలు ఉన్నాయని తెలిపింది.

ఇదీ చదవండి:'రక్షణ బంధాన్ని మరింత బలోపేతం చేద్దాం'

భారత్​తోనే భరోసా!

2020లో సాంకేతికత పరంగా భారత్​పై అమెరికా ఆధారపడుతున్న విషయాన్ని బట్టి.. అగ్రరాజ్యానికి భారత్​ కన్నా ముఖ్యమైన ద్వైపాక్షిక సంబంధాలు ఉండవని స్పష్టం చేసింది. భౌగోళిక రాజకీయ శక్తులు అమెరికా-భారత్​ను దగ్గర చేస్తన్నాయని.. దీర్ఘకాలంగా అమెరికా, పశ్చిమ దేశాల మధ్య ఉన్న సంబంధాలు ప్రస్తుతం ఎంతమాత్రం భరోసా ఇవ్వవని చెప్పుకొచ్చింది.

భారత్-అమెరికా సంయుక్తంగా సాంకేతిక విధానాలు, నియమ, నిబంధనలను రూపొందించాలని ఐటీఐఎఫ్ ఫౌండేషన్ సూచించింది. అంతర్జాతీయ విధానాలు రూపొందించే క్రమంలో ఐరోపా సమాఖ్య, చైనా నిబంధనలకు ఇవి శక్తిమంతమైన ప్రత్యామ్నాయాలుగా ఉండాలని పేర్కొంది. భారత్​ ఇలాంటి విధానాల్లో కొన్నింటిని ఇప్పటికే రూపొందించిందని.. ఇప్పుడు బైడెన్ ప్రభుత్వం ఈ అంశాన్ని ప్రాధాన్యంగా స్వీకరించాలని నివేదిక నొక్కి చెప్పింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details