చైనాలోని వుహాన్ నగరంలో మొదలైన కొవిడ్ 19 (కరోనా) వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలను పట్టి పీడిస్తోంది. ఇప్పటికే సుమారు 60 దేశాలకు పైగా ఈ మహమ్మారి వ్యాపించింది. తాజాగా చైనాలో సోమవారం నమోదైన కేసులను పరిశీలిస్తే.. ఇతర దేశాల్లో ఈ ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమవుతోంది.
గడిచిన 24 గంటల్లో చైనాలో కంటే విదేశాల్లో దాదాపు 9 రెట్లు అధికంగా వైరస్ కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ పేర్కొన్నారు.
ఇప్పటివరకు వైరస్ కారణంగా 3000 మందికి పైగా మరణించారు. ప్రపంచవ్యాప్తంగా సుమారు 90 వేల మంది కరోనా బారిన పడ్డట్లు అధికారులు తెలిపారు. ఒక్కరోజులోనే 61 దేశాల్లో 127 మంది మరణించగా.. 8,739 కేసులను గుర్తించినట్లు డబ్ల్యుహెచ్ఓ వివరించింది. అంతేకాకుండా దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ, జపాన్ తదితర దేశాల్లో ఇటీవల నమోదైన కేసులు ఆందోళన కలిగిస్తున్నట్లు టెడ్రోస్ వెల్లడించారు.
చైనా తర్వాత స్థానంలో ఇరాన్
ఇరాన్లో ఒక్క సోమవారమే 12 మంది మరణించారు. వైరస్ కారణంగా ఆ దేశంలో ఇప్పటి వరకు 66 మంది బలికాగా.. చైనా తర్వాత అధిక మరణాలు సంభవించిన దేశంగా ఇరాన్ నిలిచింది. ఈ నేపథ్యంలోనే ఇరాన్‌కు సాయం అందించేందుకు డబ్ల్యూహెచ్ఓ ముందడుగు వేసింది. సుమారు 15 వేలమంది వైద్య సిబ్బందితో కలిసి ఆ దేశానికి చేరుకుంది.