ఇండియన్ అమెరికన్, రిపబ్లికన్ పార్టీ నేత నిక్కీ హేలీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి ఇస్తానంటే ఆమె సున్నితంగా నిరాకరించారట. మరోసారి ఇదే విషయమై చర్చ జరిగినప్పుడు కొన్ని షరతుల మేరకు ఒప్పుకొన్నానని.. తాజాగా జరిగిన ఎన్నికల ప్రచారంలో నిక్కీ స్వయంగా వెల్లడించారు.
అమెరికా ఎన్నికలు దగ్గర పడుతుండటం వల్ల దేశంలోని ప్రధాన రిపబ్లికన్, డెమొక్రటిక్ పార్టీలు ప్రచార జోరును పెంచుతున్నాయి. దేశాధ్యక్ష అభ్యర్థులతోపాటు ఆయా పార్టీల నేతలూ ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత దేశాధ్యక్షుడు ట్రంప్‌నకు మద్దతుగా ఫిలడెల్ఫియాలో శనివారం నిర్వహించిన 'ఇండియన్ వాయిస్ ఫర్ ట్రంప్' కార్యక్రమంలో నిక్కీ హేలీ పాల్గొని మాట్లాడారు. కార్యక్రమంలో ఒకరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా తనకు ట్రంప్ ఇచ్చిన గౌరవాన్ని గుర్తు చేసుకున్నారు.
"2016 అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత దక్షిణ కరోలినా గవర్నర్‌గా ఉన్న నాకు డొనాల్డ్ ట్రంప్.. సెక్రటరీ ఆఫ్ స్టేట్ పదవిని ఇస్తానన్నారు. ఈ మేరకు నన్ను న్యూయార్క్‌కు రమ్మని విమానం కూడా పంపారు. కానీ, ఆ పదవి చేపట్టేంత అర్హురాలిని కానని, అనుభవం కూడా లేదని సున్నితంగా నిరాకరించాను. ఆ తర్వాత ఐక్యరాజ్యసమితికి అమెరికా రాయబారి పదవిని చేపట్టమన్నారు. అయితే నేను మూడు షరతులు పెట్టాను. 1. రాయబారి పదవి కేబినెట్ ర్యాంక్‌లో ఉండాలి. 2. జాతీయ భద్రత మండలిలో సభ్యత్వం ఉండాలి. 3. అన్నింటికి తలాడించే వ్యక్తిగా ఉండను. ఈ మూడు షరతులు అంగీకరిస్తేనే పదవి స్వీకరిస్తానని చెప్పా. అందుకు ట్రంప్ ఒప్పుకొన్నారు"