గత కొద్ది నెలలుగా కరోనా వైరస్‌తో విలవిలలాడుతున్న ఫ్రాన్స్, స్పెయిన్ దేశాల్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడింది. ఈ నేపథ్యంలో లాక్డౌన్ ఎత్తివేతకు ఆయా దేశాలు ప్రణాళికలు రచిస్తున్నాయి. అమెరికాలో వైరస్ ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో అతి తక్కువగా కేసులు నమోదవుతున్నాయి. అయితే బ్రెజిల్ దేశం తాజాగా వైరస్‌కు కేంద్ర బిందువుగా మారినట్టు కనిపిస్తోంది.
ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 30,84,740 వైరస్ కేసులు నమోదయ్యాయి. 2,12,516మంది మరణించారు. 9.34లక్షల మంది కోలుకున్నారు.
దేశం | కేసులు | మరణాలు |
అమెరికా | 1,010,604 | 56,821 |
స్పెయిన్ | 232,128 | 23,822 |
ఇటలీ | 199,414 | 26,977 |
ఫ్రాన్స్ | 165,842 | 23,293 |
జర్మనీ | 158,768 | 6,136 |
బ్రిటన్ | 157,149 | 21,092 |
బ్రెజిల్ | 67,446 | 4,603 |
బెల్జియం | 47,334 | 7,331 |
నెదర్లాండ్స్ | 38,416 | 4,566 |
పాఠశాలు తెరిచేందుకు ఇక్కట్లు...
మే 11 కల్లా దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలను తెరిచేందుకు ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మెక్రాన్ ప్రణాళికలు రచిస్తున్నారు. నిపుణులు కూడా కరోనా వైరస్ ప్రభావం పిల్లల్లో తక్కువగా ఉంటుందని స్పష్టం చేశారు. అయితే తమ పిల్లలను పాఠశాలలకు పంపడానికి తల్లిదండ్రులు భయపడుతున్నారు. టీచర్లు కూడా స్కూళ్లకు వెళ్లడానికి సిద్ధంగా లేరు. సామాజిక దూరం పాటించమని, చేతులను శుభ్రంగా కడుక్కోమని చెప్పగలమే కానీ.. ప్రతీసారీ పిల్లలను పర్యవేక్షించడం కష్టమని అంటున్నారు. అయితే పాఠశాలలు తెరుచుకోకుండానే.. ఉద్యోగాలకు వెళ్లాల్సి వస్తే తల్లిదండ్రులకు కష్టమైన విషయమే.
మరణాలు తగ్గాయి...
అమెరికాలో వైరస్‌కు కేంద్రబిందువుగా మారిన న్యూయార్క్‌లో మరణాలు తగ్గుముఖం పట్టాయి. అటు న్యూజెర్సీలోనూ ఇదే పరిస్థితి నెలకొనడం వల్ల ఇరురాష్ట్రాల గవర్నర్లు జనజీవనం పునరుద్ధరణకు ప్రణాళికలు రచిస్తున్నారు.
న్యూయార్క్‌లో మే 15తో లాక్డౌన్ ముగియనుంది. ఆ తర్వాత.. వైరస్ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో నిర్మాణాలు, ఉత్పత్తికి సంబంధించిన కార్యకలాపాలను ప్రారంభించేందుకు ఆ రాష్ట్ర గవర్నర్ కౌమో యోచిస్తున్నారు. అయితే న్యూయార్క్‌లోని అనేక ప్రాంతాలు మే 15 తర్వాత కూడా లాక్‌డౌన్‌లోనే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
వైద్య సదుపాయాలు లేక...
బ్రెజిల్లో ఇప్పటివరకు 67వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. 4వేల 600మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఇవన్నీ నిజమైన లెక్కలు కావని నిపుణులు భావిస్తున్నారు. దేశంలో సరైన వైద్య పరికరాలు లేనందున పరీక్షల నిర్వహణ సరిగ్గా జరగడం లేదని ఆరోపిస్తున్నారు. మరోవైపు ఆసుపత్రుల్లో బాధితుల సంఖ్య భారీగా పెరగడం వల్ల అనేక హాస్పిటళ్లు చికిత్స అందించలేక ఇప్పటికే చేతులెత్తేశాయి.