అమెరికాలో కరోనా వ్యాప్తికి కేంద్ర బిందువు న్యూయార్క్ నగరం. ఇప్పుడు ఆ రాష్ట్రంలోని చిన్నారుల్లో మరో ప్రమాదకర వ్యాధి వ్యాప్తి చెందుతున్నట్లు అధికారులు గుర్తించారు. కరోనా సోకిన వారిలోనే ఈ లక్షణాలు ఉండటం అక్కడి యంత్రాంగానికి మరింత ఆందోళన కల్గించే అంశం. ఈ అంతుచిక్కని వ్యాధి బారిన పడి ఇప్పటికే ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. వీరి వయసు 2, 5, 7 ఏళ్లు అని వివరించారు గవర్నర్ ఆండ్రూ క్యూమో. న్యూయార్క్‌లో అరుదైన ఇన్ఫ్లమేటరీ ఇల్నెస్కు గురవుతున్న 110 కేసులపై అధ్యయనం ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.
కొవిడ్-19తో సంబంధమున్న ఈ ప్రమాదకర వ్యాధిని పిడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌గా గుర్తించారు. కవాసాకి, టాక్సిక్ షాక్ సిండ్రోమ్ లాంటి వ్యాధి అని వివరించారు. పరిస్థితి తీవ్రంగా, ఆందోళనకరంగా ఉన్నట్లు క్యుమో తెలిపారు. న్యూయార్క్‌లోనే కాకుండా మరో 16 రాష్ట్రాల్లోని చిన్నారుల్లోనూ ఈ వ్యాధి లక్షణాలు గుర్తించామని.. రానున్న రోజుల్లో కేసుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు.