ఆన్లైన్లో శిక్షణ పొందే విదేశీ విద్యార్థులు దేశాన్ని వీడాలంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన నిబంధనలు.. విదేశీ విద్యార్థులను గందరగోళంలో పడేశాయి. ముఖ్యంగా భారతీయుల్లో తీవ్ర అనిశ్చితి నెలకొనే అవకాశముందని, విద్యార్థులు కష్టాలు ఎదుర్కొంటారని వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం ఆందోళన వ్యక్తంచేసింది.
"నూతన విద్యా సంవత్సరానికి సంబంధించి అమెరికాలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలలు ప్రణాళికలు ఇంకా విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ కొత్త నిబంధనలతో అమెరికాలో చదువుకుందామనుకునే భారతీయ విద్యార్థులను తీవ్ర అనిశ్చితికి గురిచేస్తుంది."
--- భారత రాయబార కార్యాలయం ప్రతినిధి.
అమెరికా విశ్వవిద్యాలయాలపై ఒత్తిడి పెంచేందుకు.. అగ్రరాజ్యంలో ఉంటూ ఆన్లైన్లో శిక్షణ పొందుతున్న విదేశీ విద్యార్థులందరూ దేశాన్ని విడిచి వెళ్లాలని, లేకపోతే క్యాంపస్లో తరగతులు బోధించే విద్యాలయాలకు బదిలీ కావాలని తేల్చిచెప్పింది ట్రంప్ ప్రభుత్వం.
ఈ విషయంపై భారత ప్రభుత్వం ఇప్పటికే సంబంధిత అమెరికా అధికారులను సంప్రదించిందని ప్రతినిధి స్పష్టం చేశారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో తీవ్రంగా దెబ్బతిన్న భారతీయ విద్యార్థుల సంఘాలను దృష్టిలో పెట్టుకుని.. అమెరికా ప్రభుత్వం వీసా విధానాల్లో కొన్ని వెసులుబాట్లు కల్పిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
స్టూడెంట్ అండ్ ఎక్స్ఛేంజ్ విజిటర్ ప్రోగ్రామ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది జనవరిలో అమెరికాలోని వివిధ విద్యా సంస్థల్లో 1,9,556 మంది భారతీయ విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.
ఇదీ చూడండి:-'విదేశీ విద్యార్థులను వెనక్కి పంపితే.. అమెరికాకే నష్టం'