886,709 కేసులు.. 50,243 మరణాలు.. ఇవీ అమెరికాలో కరోనా వైరస్ ప్రస్తుత గణాంకాలు. ప్రపంచంలో మరే ఇతర దేశాల్లో లేనంతగా కేసులు, మరణాలు అగ్రరాజ్యంలోనే నమోదయ్యాయి. తొలి కరోనా మరణం(ఫిబ్రవరి 29) గుర్తించినప్పటి నుంచి వైరస్ కట్టడికి చర్యలను కఠినం చేసింది అమెరికా. అయితే దీనికి.. దాదాపు మూడు వారాల ముందే వైరస్‌తో అమెరికాలోనే అత్యంత జనాభా కలిగిన కాలిఫోర్నియాలో ఇద్దరు మృతిచెందారన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వీటిని ముందే గుర్తించి ఉంటే అగ్రరాజ్యంలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉండేవి కావని విశ్లేషకులు అంటున్నారు.
అసలేం జరిగింది..?
ఫిబ్రవరి 6న కాలిఫోర్నియాలోని శాంటా క్లారా కౌంటీకి చెందిన 57ఏళ్ల వృద్ధురాలు, అదే నెల 17న 69ఏళ్ల వృద్ధుడు మరణించారు. జనవరి చివరి వారం నుంచి ఫ్లూ లక్షణాలతో బాధపడిన వృద్ధురాలు.. కోలుకుంటున్న సమయంలో ప్రాణాలు కోల్పోయిందని బంధువులు తెలిపారు.
అయితే వీరి కణజాలం నమూనాలను సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఫర్ ఎనాల్సిస్(సీడీసీ)కు పంపగా.. మంగళవారం రిపోర్టులు వచ్చాయి. అందులో మృతులకు వైరస్ సోకినట్టు తేలింది.
ఎన్నో ప్రశ్నలు...
అయితే వీరిద్దరు ఆ మధ్యకాలంలో దేశాన్ని విడిచి వెళ్లలేదు. మరి వీరికి వైరస్ ఎలా సోకిందనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. అప్పటివరకు ఎలాంటి లాక్డౌన్ లేకపోవడం, పర్యటనలపై నిషేధాలు లేకపోవడం వల్ల చైనా సహా వైరస్ బాధిత దేశాల నుంచి వేలమంది ప్రజలు అమెరికాలో పర్యటించారని గుర్తుచేస్తున్నారు.
పైగా కాలిఫోర్నియాలో ఫ్లూ వంటి లక్షణాలతో ఆ సమయంలో ప్రజలు సతమతమయ్యారు. అందువల్ల కరోనా వైరస్‌ను ప్రత్యేకించి గుర్తించడం జరిగి ఉండదని ఉత్తర కాలిఫోర్నియా ఆరోగ్య డైరక్టర్ డా.సారా కోడీ తెలిపారు. అప్పటికి వైరస్ పరీక్షలు నిర్వహించడానికి కాలిఫోర్నియాలో సరైన పరికరాలు లేవని పేర్కొన్నారు. ఎవరికి పరీక్షలు నిర్వహించాలి? అనే దానిపైనా ప్రభుత్వం పరిమితులు విధించిందన్నారు.