ప్రపంచంలో అత్యంత వేగంగా పని చేసే సూపర్ కంప్యూటర్ల జాబితాలో మరో సూపర్ కంప్యూటర్ త్వరలోనే చేరనుంది. అమెరికా వ్యోమింగ్‌లోని చెయెన్నే సూపర్ కంప్యూటింగ్ సెంటర్లో దీన్ని అభివృద్ధి చేస్తున్నారు. వాతావరణ మార్పులు, కార్చిచ్చులు, సౌర మార్పులు.. వంటివి అధ్యయనం చేయడంలో ఈ సూపర్ కంప్యూటర్ అత్యంత వేగంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హ్యూస్టన్‌కు చెందిన హెవ్లెట్ ప్యాకర్డ్ ఎంటర్ప్రైజెస్(హెచ్‌పీఈ) అనే సంస్థ.. ఈ సూపర్ కంప్యూటర్‌కు కావాల్సిన యంత్ర పరికరాలను సరఫరా చేయడానికి సిద్ధమైంది. 35 నుంచి 45 మిలియన్ల డాలర్ల వరకు దీని కోసం ఖర్చు చేయనుంది. ఈ మేరకు కొలరాడోలోని నేషనల్ సెంటర్ ఫర్ అట్మాస్ఫియరిక్ రీసెర్చ్(ఎన్సీఏఆర్) బుధవారం తెలిపింది.