కరోనా ప్రపంచదేశాలను అతలాకుతలం చేస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేందుకు ఇంకా చాలా సమయం పట్టేలా ఉంది. ప్రస్తుతానికి వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టులను పెంచి.. సరైన సమయంలో బాధితులను గుర్తించి చికిత్స అందించడమే మేలంటున్నారు వైద్య నిపుణులు. అయితే.. వైరస్‌ను కచ్చితత్వంతో వేగంగా నిర్ధరించగలిగే కిట్లు పెద్దగా అందుబాటులో లేవు.
దీనిని దృష్టిలో పెట్టుకొని.. పరిశోధకులు ఒక కొత్త రాపిడ్ టెస్ట్ కిట్‌ను రూపొందించారు. ప్రామాణిక కొవిడ్-19 నిర్ధరణ పరీక్ష ఫలితాలతో సరిచూస్తే.. ఈ కిట్‌తో 93 శాతం అనుకూలంగా రిజల్ట్స్ వచ్చాయని చెబుతున్నారు. న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైన అధ్యయనంలో ఇందుకు సంబంధించిన విషయాలు వెల్లడించారు పరిశోధకులు, శాస్త్రవేత్తలు. ఇందులో అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)కి చెందినవారూ ఉన్నారు.
'స్టాప్ కొవిడ్'గా పిలిచే ఈ నిర్ధరణ పరీక్ష కిట్ అతి తక్కువ ధరలోనే లభ్యమవుతుందని, ప్రజలు రోజూ స్వయంగా టెస్టులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు పరిశోధకులు. ఇలాంటి పరీక్షలతో లక్షణాలు లేకుండా కరోనా సోకిన వారిని త్వరగా గుర్తించవచ్చని.. తద్వారా వైరస్ వ్యాప్తి చెందకుండా నిరోధించవచ్చని అంటున్నారు.