తెలంగాణ

telangana

ETV Bharat / international

ఆ రాష్ట్రంలో భారీగా కరోనా మరణాలు- ఒక్కసారిగా 12 వేలు... - న్యూజిలాండ్​లో కరోనా కొత్త కేసులు

కరోనా(Coronavirus) ఉద్ధృతి కొనసాగుతోంది. డెల్టా వేరియంట్​ కారణంగా.. అమెరికాలోని చాలా ఆస్పత్రుల్లో పడకల కొరత ఎదురవుతోంది. మరోవైపు, న్యూయార్క్​లో కరోనా మరణాల సంఖ్య(Covid deaths) ఒక్కసారిగా 12వేల మేర పెరగడం తేలడం ఆందోళన కలిగించింది. అయితే.. దీనికి ఆ రాష్ట్ర మాజీ గవర్నర్​ తప్పిదమే కారణంగా తెలుస్తోంది.

world corona cases
ప్రపంచంలో కరోనా కేసులు

By

Published : Aug 26, 2021, 11:56 AM IST

ప్రపంచవ్యాప్తంగా కరోనా(Coronavirus) వ్యాప్తి కొనసాగుతోంది. అమెరికా న్యూయార్క్​లో కరోనా మరణాల సంఖ్య అమాంతం పెరిగింది. వైరస్​ సోకి చనిపోయిన(Covid deaths) వారి సంఖ్యను ఒక్కసారిగా 12 వేల మేర పెంచినట్లు న్యూయార్క్​ గవర్నర్​గా బాధ్యతలు చేపట్టిన కాథీ హోచుల్​ తెలిపారు. అయితే.. కరోనా మరణాలను మాజీ గవర్నర్​ ఆండ్రూ కూమో దాచిపెట్టడమే ఈ సంఖ్య పెరుగుదలకు కారణమని చెప్పారు.

"కరోనా గురించి మంచైనా, చెడు అయినా.. ఏం జరుగుతోందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలి. వారికి నిజం చెప్పాలి. అప్పుడే మనం ధైర్యంగా ఉండగలం. సంఖ్యల విషయంలో పారదర్శకత పాటించడం అత్యంత ప్రధానమైన అంశం. "

-కాథీ హోచుల్​, న్యూయార్క్​ గవర్నర్​

న్యూయార్క్​లో కరోనా కారణంగా మొత్తం 55,400 మంది మరణించారని.. మంగళవారం సాయంత్రం గవర్నర్​ హోచుల్​ ​ కార్యాలయం వెల్లడించింది. వ్యాధి నియంత్రణ కేంద్రానికి సమర్పించిన మరణ ధ్రువీకరణ పత్రాల సమాచారం ఆధారంగా ఈ మరణాల సంఖ్యను నిర్ధరించినట్లు చెప్పింది.

మాజీ గవర్నర్​ ఆండ్రూ కూమో తన పదవీ చివరిరోజైన సోమవారం.. కరోనా కారణంగా రాష్ట్రంలో మొత్తం 43,400 మంది మరణించారని చెప్పారు. కానీ, కొత్త గవర్నర్​ కాథీ హోచుల్​ మరో 12 వేల మరణాలను జోడించారు. అయితే.. ఈ మరణాల విషయాన్ని వెల్లడించే ముందు.. ఆరోగ్య శాఖ అధికారులను హోచీ సంప్రదించారని ఆమె ప్రతినిధి హాలీ వికారో తెలిపారు.

వ్యాక్సిన్ తీసుకోకపోతే డబ్బలు వసూలే!

మరోవైపు అమెరికాలోని పలు సంస్థలు కరోనా కట్టడి కోసం కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. తమ ఉద్యోగులు వ్యాక్సిన్(Vaccination) తీసుకోకపోతే.. ఆరోగ్య బీమా ప్రీమియంలో భాగంగా వారి వద్ద నుంచి నెలకు 200 డాలర్లను అధికంగా వసూలు చేయనున్నట్లు డెల్టా ఎయర్​లైన్స్​ సంస్థ ప్రకటించింది. వైరస్ బారినపడి ఆస్పత్రిలో చేరితే.. దాదాపు 50వేల డాలర్ల వరకు తమ సంస్థ ఖర్చు చేస్తున్నందున ఈ మేరకు ప్రీమియం ఛార్జీలను పెంచుతున్నట్లు సంస్థ నిర్వాహకులు తెలిపారు.

కొన్ని వారాలుగా కరోనా బారిన పడి చికిత్స పొందిన తమ ఉద్యోగుల్లో చాలా మంది వ్యాక్సిన్ తీసుకోని వారేనని డెల్టా ఎయిర్​లైన్స్​ సీఈఓ ఎడ్​ బాస్టెయిన్ తెలిపారు. టీకా తీసుకోని వారు.. వారానికోసారి పరీక్షలు చేసుకునేలా నిబంధనలు విధిస్తామని చెప్పారు. సంస్థ ప్రాంగణంలో తప్పనిసరిగా మాస్కు ధరించేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:Corona cases: 'వారానికి 45 లక్షల కేసులు'

ఆస్పత్రుల్లో భారీగా చేరికలు..

మరోవైపు.. వాషింగ్టన్​లో(covid in washington) కరోనా విజృంభణ కొనసాగుతోంది. ప్రతి 18 నుంచి 19 రోజులకు కొవిడ్​తో ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య రెట్టింపు అవుతుందని ఆ రాష్ట్ర ఆరోగ్య అధికారులు చెప్పారు. డెల్టా వేరియంట్​ కారణంగానే.. ఆస్పత్రిలో చేరికలు ఎక్కవగా ఉంటున్నాయని వాషింగ్టన్​ ఆరోగ్య కార్యదర్శి డాక్టర్ ఉమైర్​ షా తెలిపారు. ఫలితంగా ఆస్పత్రుల్లో పడకల కొరత ఏర్పడుతోందని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఆస్పత్రుల్లో ఈ సమస్య ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:Delta Variant: ''డెల్టా'తో వైరల్ లోడు 300 రెట్లు అధికం'

న్యూజిలాండ్​లో డెల్డా కలవరం..

న్యూజిలాండ్​లోనూ(Corona in new zealand) మళ్లీ కరోనావ్యాప్తి కొనసాగుతోంది. డెల్టా వేరియంట్​ కారణంగా ఆ దేశంలో కొత్తగా 68 కరోనా కేసులు వెలుగు చూశాయి. గతేడాది ఏప్రిల్​ నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదు కావటం ఇదే తొలిసారి.

గతవారం కరోనా కేసులు వెలుగుచూడగా ఆ దేశంలో లాక్​డౌన్(New zealand lock down) విధించారు. అయితే.. అక్కడ వారం వ్యవధిలోనే 277 మందికి వైరస్​ సోకినట్లు తేలింది. అయితే.. లాక్​డౌన్ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతోందని ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెన్ తెలిపారు. త్వరలోనే కొత్త కేసులు కూడా తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరోవైపు.. అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం విధించినందున ఆ దేశంలోని ఎయిర్​ న్యూజిలాండ్​ విమాన సంస్థ 306 మిలియన్ అమెరికన్ డాలర్ల మేర నష్టాన్ని చవిచూసింది.

ఇదీ చూడండి:డేంజర్‌ 'డెల్టా'కు చైనా చెక్‌.. ఎలా సాధ్యమైందంటే?

ప్రపంచంలో ఇలా..

ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 7,18,997 మందికి కరోనా(Global corona virus update) సోకినట్లు తేలింది. వైరస్​ ధాటికి మరో 11,299 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 21,47,01,750కి చేరగా.. మరణాల సంఖ్య 44,75,549కి పెరిగింది.

వివిధ దేశాల్లో కరోనా కొత్త కేసులు

దేశం కొత్త కేసులు కొత్త మరణాలు
అమెరికా 1,71,737 1,287
బ్రెజిల్ 30,529 901
రష్యా 19,536 809
ఫ్రాన్స్ 23,706 93
బ్రిటన్ 35,847 149
జర్మనీ 12,490 33

ABOUT THE AUTHOR

...view details