వేగంగా వ్యాపిస్తూ ప్రపంచాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్న కరోనా వైరస్(కొవిడ్-19) గాల్లో, బయటి ఉపరితలాలపై మనుగడ సాగిస్తుందా? లేదా?. దీనిపై ఇంకా సందిగ్ధం కొనసాగుతూనే ఉంది. అయితే అమెరికాలో జరిపిన ఓ అధ్యయనం మాత్రం ఈ వైరస్ గాల్లో, ఉపరితలాలపై కొన్ని గంటలపాటు జీవించగలదని చెబుతోంది. మానవ శరీరం వెలుపల జీవించడంలో గతంలో వచ్చిన సార్స్‌కు ఉన్న సామర్థ్యమే దీనికి కూడా ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. బహుశా ఈ కారణం వల్లే సార్స్ కంటే కూడా కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతుందని అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ‘సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్’(సీడీసీ), కాలిఫోర్నియా, లాస్ ఏంజిల్స్, ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయాలకు చెందిన శాస్త్రవేత్తలు దీనిపై పరిశోధనలు చేశారు. దీనికి సంబంధించిన ఫలితాలను న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్(ఎన్‌ఈజేఎం)లో ప్రచురించారు.
పరిశోధన విధానంపై విమర్శలు
కార్ట్‌బోర్డ్‌పై 24 గంటలు, స్టెయిన్‌లెస్ స్టీల్, ప్లాస్టిక్‌పై రెండు, మూడు రోజుల వరకు ఈ వైరస్ జీవించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే వీరు జరిపిన పరిశోధనా విధానంపై విమర్శలు వస్తున్నాయి. వీరు మనిషి దగ్గు లేదా తుమ్మడాన్ని అనుకరించేందుకు నెబ్యులైజర్‌ను వాడారు. నెబ్యులైజర్ ద్వారా సృష్టించిన కృత్రిమ దగ్గు లేదా తుమ్ము ఓ మానవుని సాధారణ దగ్గు, తుమ్ముతో ఎలా పోల్చగలమని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వారం కిందే ఈ పరిశోధనా ఫలితాలు ఓ వెబ్‌సైట్‌లో ప్రచురితమయ్యాయి. అప్పటి నుంచి వీరి పరిశోధనపై విమర్శలు వస్తూనే ఉన్నాయి.